సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 162వ జయంతోత్సవం

3 గంటల క్రితం

6
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 06:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి, విజయనగరం కోట : తెలుగు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెరగని ముద్ర వేసిన హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 162వ జయంతోత్సవం ఆదిభట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ ఆనంద నారాయణదాసు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిభట్ల నారాయణదాసు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆనంద నారాయణదాసు మాట్లాడుతూ, హరికథ అనేది కేవలం ఒక కళారూపం మాత్రమే కాదని, తెలుగు సాహిత్యం, సంగీతం, సంస్కృతి, ఆధ్యాత్మికతలను ఒకే వేదికపై సమన్వయం చేసే మహత్తర సాంస్కృతిక సంపద అని పేర్కొన్నారు. తెలుగు భాషకు ఉన్న మాధుర్యాన్ని, తెలుగు సాహిత్యానికి ఉన్న విశిష్టతను, మన సంస్కృతికి ఉన్న ఔన్నత్యాన్ని తన హరికథ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు ఆదిభట్ల నారాయణదాసు అని ఆయన కొనియాడారు.

“కళాకారుడు బతికితేనే కళ బతుకుతుంది. కళాకారుడు బతకాలంటే అతని ప్రతిభకు సమాజం గుర్తింపు, గౌరవం కల్పించాలి. కళాకారులను ప్రోత్సహించడం అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు—మన సాంస్కృతిక బాధ్యత. హరికథను పరిరక్షించడం, కళాకారులకు అండగా నిలవడం, ప్రతిభను గుర్తించి గౌరవించడం, భావితరాలకు ఈ కళా సంపదను అందించడం శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ సంకల్పం.” అని ఆనంద నారాయణదాసు స్పష్టం చేశారు.

5

అనంతరం ప్రముఖ హరికథ భాగవతార్ శ్రీ బి. ఎతిరాజ్ గారు అందించిన “హరికథ గానామృతం – ధ్రువ చరిత్ర” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ వెలమల శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని, ఆదిభట్ల నారాయణదాసు గారి కళా వారసత్వాన్ని పరిరక్షిస్తూ హరికథకు, కళాకారులకు అందిస్తున్న ప్రోత్సాహం సాంస్కృతిక రంగానికి ఎంతో విలువైన సేవ అని పేర్కొన్నారు.

“తెలుగు సాహిత్య చరిత్రలో ఆదిభట్ల నారాయణదాసు గారు ఒక మహోన్నత సంతకం. హరికథ కళకు స్వర్ణయుగాన్ని అందించిన మహనీయుడు. సాహిత్యం, సంగీతం, హరికథ, సంస్కృతి—అన్నింటినీ సమన్వయం చేసి తెలుగు కళా వైభవాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన విశిష్ట ప్రతిభాశాలి.” అని డాక్టర్ వెలమల శ్రీనివాసరావు కొనియాడారు భాగవతార్ ఎతిరాజు గారిని సత్కరించారు

సంగీత రంగంలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ మండపాక రవి, శ్రీమతి శారద దంపతులను శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల నారాయణదాసు గారి అభిమానులు, కళాభిమానులు, ఫౌండేషన్ సభ్యులు రాజ్యలక్ష్మి, మంజూష తదితరులు పాల్గొన్నారు.

“వారసత్వాన్ని స్మరించుకోవడం కాదు… వారసత్వాన్ని కొనసాగించడమే లక్ష్యం”


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్