గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయనగరం మేయర్ అభ్యర్థిగా కోట సునీత : ఆప్

1 గంట క్రితం

aap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 10:36 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : ప్రజాసేవ, అవినీతి రహిత పాలన, నగర అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి కోట సునీత విజయనగరం మేయర్ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోట సునీత పోటీ చేయనున్నట్లు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శీర రమేష్ కుమార్ ప్రకటించారు. గురువారం విజయనగరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శీర రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పాలన, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజల ముందుకు తీసుకువస్తోందని తెలిపారు.ఉన్నత విద్యను అభ్యసించి, ఐటీ రంగంలో 25 సంవత్సరాలు అమెరికాలో సుమారు 14 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం కలిగి ఉన్నానని, అధిక వేతనంతో కూడిన ఉద్యోగ జీవితాన్ని విడిచిపెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ప్రజాసేవ లక్ష్యంతో భారతదేశానికి తిరిగి వచ్చి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. విజయనగరం నగర ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు, నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేయడమే తన రాజకీయ లక్ష్యమని శీర రమేష్ కుమార్ తెలిపారు. మేయర్ అభ్యర్థి కోట సునీత శీర రమేష్ కుమార్ సతీమణి. ఆమె ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తూ, విజయనగరం నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలనే లక్ష్యంతో ఆమె మేయర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలిపారు.

విజయనగరం నగర అభివృద్ధికి సంబంధించి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, పార్కులు, పచ్చదనం, చెరువుల పరిరక్షణ, క్రీడా మైదానముల ద్వారా ఆరోగ్యము, యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం బాధ్యతాయుతమైన పాలన అందించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న తమ అభ్యర్థిత్వాలను విజయనగరం నగర ప్రజలు పరిశీలించాలని, నగర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, అభ్యర్థుల ఆలోచనలు, ప్రజాసేవ పట్ల వారి నిబద్ధతను పరిగణనలోకి తీసుకొని తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని శీర రమేష్ కుమార్ గారు నగర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమములో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ డా పైలా రమేష్ రాజు, జిల్లా కార్యదర్శి ప్రతాప వర్మ, సిటీ కన్వీనర్ మొహమ్మద్ నయీమ్, జిల్లా సంయుక్త కార్యదర్శి బురాడ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బూసర్ల రమణా రావు మరియు ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్