ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : విద్యార్దుల భవిష్యత్తు కోసం, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం 24 న విద్యార్ధి సంఘాలు తలపెట్టిన విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్ది సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం స్థానిక అమర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సుమన్, ఎస్ ఎఫ్ ఐ కార్యదర్శి రాము, ఎ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బూర వాసు, డి వై ఎఫ్ ఐ నాయకులు రవి మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని, పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాల్సిన జాతీయ స్థాయి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల విద్యా వ్యవస్థపై విద్యార్థుల్లో విశ్వాసం దెబ్బతిందన్నారు. ఇలాంటి తీవ్రమైన వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ నిర్వహించి బాధ్యులందరినీ చట్టపరంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలనే లక్ష్యంతో ఈ నెల 24వ తేదీన ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని అన్నారు. బంద్ ఏ ఒక్క సంఘానిదో కాదు దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత, న్యాయం, జవాబుదారీతనం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య నిరసన అని అన్నారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేసి విజయవంతం చేయాలని కోరారు. విద్యను వ్యాపారంగా కాకుండా హక్కుగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విద్యార్థుల శ్రమకు విలువ దక్కేలా, పరీక్షలపై నమ్మకం నిలిచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈనెల 24న జరిగే విద్యాసంస్థల బంద్‌లో ప్రతి విద్యార్థి చైతన్యంతో పాల్గొని, ప్రశాంతంగా, క్రమశిక్షణతో బంద్‌ను జయప్రదం చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు శిరీష, చరణ్, గణేష్, సూరిబాబు, గౌరీ శంకర్, దుర్గాప్రసాద్, సోమేశ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు
ఈనెల 24న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి: విద్యార్ది సంఘాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 03:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)