ఎప్పటి కప్పుడు ప్రజలపైన,ప్రజా ఉద్యమాలు పైన నిర్బంధాలు దుర్మార్గం
సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో సెక్షన్ 30, ఎస్మాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం విజయనగరం స్థానిక ఎల్బిజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎప్పటికప్పుడు సెక్షన్ 30 అమలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజా ఉద్యమాలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియంతృత్వ పోకడలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న ప్రదర్శనలను,ర్యాలీలను కూడా చేయవద్దని నియంత్రించడం ఇదెక్కడి న్యాయమన్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతంలోను,సమస్యలు ఉన్నప్రాంతాలు ,మండలాల్లోనూ ప్రజలు,రైతులు సమస్యలనుచెప్పుకోకుండా, ప్రతిఘటించకుండా నియంత్రించేందుకు సెక్షన్ 30ని, ఎస్మాను ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద కూడా కేంద్ర ప్రభుత్వం నిరసనలు తెలియజేయకుండా జీవోలు విడుదల చేసిందని అన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగానే ప్రజలు ఉద్యమాలు, నిరసనలు చేయాల్సి వస్తుందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత , ప్రజా ఉద్యమాల పైన, ప్రజాస్వామ్యం పైన దాడిని తీవ్రతరం చేసిందని తెలిపారు. ప్రజలు నిరంతరం సమస్యల్లో కూరుకు పోతున్నారని, ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కారం చేయకుండా కార్పొరేట్ శక్తుల సమస్యలను పరిష్కారం చేయడానికి వారి సేవలో ప్రభుత్వ ములుగు తేలుతుందని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు సమస్యలు,కార్మికులు ,విద్యార్ధి,యువజనుల సమస్యలు ఏవీ ప్రభుత్వం పట్టించు కోకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల యువకులు నిర్వీర్యం అయిపోతున్నారని అన్నారు. యువతకు సరైన ఉపాధి లేక పెంచిన తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారని దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని ఇలాంటి నేపథ్యంలో ప్రజలు,విద్యార్థులు ,యువకులు తప్పని పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలలోకి రావాల్సి వస్తుందని అన్నారు. వీటన్నింటికీ పరిష్కారం కనుక్కోకుండా ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలను ప్రయోగించాలనుకుంటే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇప్పటికే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. జిల్లా లో భోగాపురం రైతులు డేటా సెంటర్లు మాకు వద్దని పోరాటం చేస్తుంటే వారి పైన నిర్బంధం ప్రయోగించి సమస్యను కలెక్టర్కు తెలియజేయడానికి వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదని అన్నారు. అలాగే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలు చేయరాదని చెప్పడం సరినది కాదని , అధికారులు ఉన్నచోట కాకుండా అధికారులు లేని చోట నిరసనలు తెలియజేస్తే సమాధానం ఎవరో చెప్తారని పరిష్కారానికి చర్యలు ఎవరు చేపడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాలపై పునర్ ఆలోచన చేయాలని, జిల్లాలో సెక్షన్ 30 ని,ఎస్మాను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, టీవీ రమణ పాల్గొన్నారు.








కామెంట్లు (0)