బస్సుల్లో పునరావాస కేంద్రాలకు తరలింపు
జేసీ ఫర్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ టీమ్ ఏర్పాటు
ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : అర్నబ్ తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం తీవ్ర స్థాయిలో అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం మరియు భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు నివారణ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం నాడు జాయింట్ కలెక్టర్ (జేసీ) ఫర్మాన్ ఖాన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో బూర్జ మండలం, అల్లిన గ్రామంలో ప్రత్యేక ఎమర్జెన్సీ టీమ్‌ను ఏర్పాటు చేశారు.
ముంపు ముప్పు నుంచి ముందస్తు చర్యలు ....
తుఫాను ధాటికి నాగావళి నది ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో పాటు ఏ క్షణంలోనైనా వరద నీరు గ్రామాన్ని చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉందని అధికారులు గుర్తించారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ ఫర్మాన్ ఖాన్ గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, అల్లిన గ్రామస్తులను సురక్షితంగా గుత్తా వెళ్లి గ్రామంలోని ఎస్వీ కళ్యాణమండపం మరియు పెద్దపేట సచివాలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.
అధికారులకు పక్కా ప్రణాళిక ... జేసీ కీలక ఆదేశాలు ....
పరిస్థితిని సమీక్షించిన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఖాన్, క్షేత్రస్థాయి అధికారులకు మరియు ఎమర్జెన్సీ టీమ్ సిబ్బందికి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. రహదారుల పునరుద్ధరణ ఈదురుగాలుల వల్ల రహదారులపై కూలిన చెట్లు లేదా ఇతర అడ్డంకులను వెంటనే తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
నీటి నిల్వలు పారిశుధ్యం : లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైతే రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలు పూర్తి సమన్వయంతో తక్షణమే స్పందించాలి.
“తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు నిరంతర సహాయ సహకారాలు అందించడమే మన ప్రధాన బాధ్యత. తుఫాను ప్రభావ తీవ్రతను నిమిష నిమిషం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వ పునరావాస కేంద్రాలలో సురక్షితంగా ఉండాలని సిబ్బందిని జెసి ఆదేశించారు . ఆయనతోపాటు ఆర్డీవో సాయి ప్రత్యూష ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.









కామెంట్లు (0)