ప్రజాశక్తి-విజయనగరం కోట: పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహెచ్.అగ్రహారంలో జరిగిన భూ వ్యవహారానికి సంబంధించి గుడివాడ కృష్ణపై పోలీసులు రెండు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారిని బెదిరించినట్లు, భూ వ్యవహారంపై వార్త ప్రచురించిన ఓ పత్రికా రిపోర్టర్‌పై భౌతిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెళితే.. సిహెచ్.అగ్రహారం గ్రామంలోని ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించినట్లు వచ్చిన సమాచారంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణ రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు, వారిని బెదిరించినట్లు మండల తహసీల్దార్ పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా, ఈ భూ వ్యవహారంపై పత్రికలో వార్త ప్రచురించిన రిపోర్టర్‌పై గుడివాడ కృష్ణ భౌతిక దాడికి పాల్పడినట్లు వచ్చిన మరో ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండు కేసులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా నిందితుడిపై చట్టపరమైన తదుపరి చర్యలు చేపడతామని జిల్లా పోలీసు కార్యాలయం వెల్లడించింది.
గుడివాడ కృష్ణపై రెండు కేసులు నమోదు
22 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 22, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)