ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ( డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో గురువారం కోట జంక్షన్ వద్ద నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరుద్యోగులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ .. కూటమి ప్రభుత్వం బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అని చెప్పి నిరుద్యోలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాల తర్వాత జాబ్ లాస్ క్యాలెండర్ విడుదల చేయడం అన్యాయం అన్నారు. 19000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తు ఓ మంత్రి స్వయంగా ప్రకటించారని ఇప్పుడేమో జాబ్ క్యాలెండర్‌లో 2500 పోస్టులు చూపడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2500 కానిస్టేబుల్ పోస్టులు లు రద్దు చేసి తక్షణమే 10వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాల నుండి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వనందున వయోపరిమితి 35 కి పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే నిరుద్యోగులుకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ‘చలో విజయవాడ’ చేపట్టి వేలాది మందితో అసెంబ్లీనీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రకటించిన పోస్టుల్లో సగం రిజర్వేషన్ కోటాలో పోతే మిగిలే అరకొర పోస్టులు.. నిరుద్యోగులకు ఊరట కల్పించవని వ్యక్తం చేశారు.
నిరుద్యోగి నవీన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగాలు లేవని అన్నారు. వయోపరిమితి పెంచాలని కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని నిరుపేద కుటుంబాలను చెందిన నిరుద్యోగ యువత కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. పరీక్షలకు ప్రిపేరవుతూనే పస్తులు ఉంటూనే పరీక్షల కోసం ప్రిపేరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వోకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత నవీన్, కుమార్, ధర్మరాజు,కుమార్, పృథ్వి, సాయి రామక్రిష్ణ సహా 600 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)