సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తమిళ రచయిత పూమణి కన్నుమూత

2 గంటల క్రితం

poonami
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 10:35 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ రచయిత పూమణి (79) ఆదివారం రాత్రి చెన్నైలో దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. విరుదునగర్ జిల్లా కరిసల్ ప్రాంత ప్రజల జీవన విధానం, వారి పోరాటాలు, సామాజిక వాస్తవాలను తన రచనల్లో హృద్యంగా ప్రతిబింబించిన రచయితగా పూమణి ప్రత్యేక గుర్తింపు పొందారు. కోవిల్‌పట్టి సమీపంలోని ఆండిపట్టిలో మణికవాసగం పేరుతో జన్మించిన ఆయన, సాహిత్య రంగంలో 'పూమణి' అనే కలంపేరుతో ప్రసిద్ధి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సహకార శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి, ఆధునిక తమిళ సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించారు. శివకాశి, కఝుగుమలై ప్రాంతాల్లో జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంతో రచించిన 'అజ్ఞాది' నవలకు 2014లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 'పిరగు', 'వెక్కై', 'నీవేధ్యం', 'కొమ్మాయి', 'వైక్కాల్', 'అజ్ఞాది' వంటి నవలలు, 'కిజిసాల్' వంటి కథా సంకలనాలు ఆయనకు విశేష ఖ్యాతి తీసుకొచ్చాయి.

సాహిత్యంతో పాటు సినీ రంగంలోనూ ఆయన సేవలందించారు.పూమణి రచించిన 'వెక్కై' నవలను దర్శకుడు వెట్రిమారన్, నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో 'అసురన్' పేరుతో తెరకెక్కించగా, ఆ చిత్రం జాతీయ అవార్డు అందుకుంది. సినిమా విజయంపై స్పందించిన పూమణి, సాహిత్య రచనను సినిమాగా మలిచేటప్పుడు మార్పులు సహజమేనని, అయితే కథలోని మౌలిక అంశాలు దెబ్బతినకూడదని అభిప్రాయపడ్డారు. అగ్గిపెట్టెల కర్మాగారాల్లో పనిచేసే చిన్నారులు, మహిళల జీవితాలపై 'కరువేలం పూకల్' చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందిన 'పెనక్కల్' టెలివిజన్ ధారావాహికకు కూడా ఆయన పనిచేశారు.

పూమణి మరణంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ సంతాపం వ్యక్తం చేశారు. కరిసల్ ప్రాంత ప్రజల జీవితాలను అసాధారణ వాస్తవికతతో చిత్రిస్తూ తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితగా ఆయనను కొనియాడారు. పూమణికి రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సిపిఎం ఎంపీ, సు.వెంకటేశన్ పూమణి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, పూమణి చరిత్రను సామాన్య ప్రజల బాధలు, వారి పోరాటాల దృక్కోణంలో ఆవిష్కరించిన అరుదైన రచయిత అని నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్