గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కనిపించవు.. కానీ కుండపోత కురిపిస్తాయి!

12 గంటల క్రితం

rivers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 10:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- వరదలకు కారణమవుతున్న తేమ ప్రవాహాలు

తిరువనంతపురం: నదులంటే మనకు వెంటనే గుర్తొచ్చేది భూమిపై ప్రవహించే నీటి ప్రవాహాలే. కానీ మన కళ్లకు కనిపించకుండా ఆకాశంలోనూ భారీ నదులు ప్రవహిస్తుంటాయి. వీటినే ‘వాతావరణ నదులు’ (Atmospheric Rivers) అంటారు. ఇవి సాధారణ నదుల్లా నీటిని కాకుండా భారీ మొత్తంలో నీటి ఆవిరిని మోసుకెళ్తున్న శక్తివంతమైన తేమ ప్రవాహాలు. కేరళలో తరచూ సంభవిస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వెనుక వీటి పాత్రపై శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

వాతావరణ నదులు దిగువ వాతావరణంలో పొడవైన, ఇరుకైన మార్గాలుగా ఏర్పడి భారీ మొత్తంలో నీటి ఆవిరిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తాయి. సముద్ర ఉపరితలం వేడెక్కినప్పుడు అక్కడి నుంచి పెద్ద మొత్తంలో నీరు ఆవిరైపోతుంది. బలమైన గాలులు ఈ తేమను ఒకే దిశలో వేగంగా తరలించినప్పుడు వాతావరణ నదులు ఏర్పడతాయి.

నైరుతి రుతుపవనాల సమయంలో దక్షిణ హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం నుంచి భారీగా తేమను మోసుకొచ్చే గాలులు భారత పశ్చిమ తీరాన్ని చేరుతాయి. ముఖ్యంగా ‘సోమాలి జెట్’ గా పిలిచే బలమైన గాలులు అరేబియా సముద్రంలోని తేమను భారతదేశం వైపు తీసుకొస్తాయి. పశ్చిమ కనుమలను తాకిన ఈ తేమ గాలులు పైకి ఎగసి చల్లబడటంతో భారీ వర్షాలకు దారితీస్తాయి.

వరదల వెనుక కారణాలు

భారీ రుతుపవన వరదల్లో వాతావరణ నదుల పాత్ర గణనీయంగా ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. గాంధీనగర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, 1951 నుంచి భారత్‌లో నమోదైన ప్రధాన రుతుపవన వరదల్లో సగానికి పైగా వాతావరణ నదుల ఉనికితో సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

2018లో కేరళను అతలాకుతలం చేసిన భారీ వరదలకు కూడా ఇలాంటి తేమ ప్రవాహాలు కీలక కారణాల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అరేబియా సముద్రంపై ఏర్పడిన భారీ తేమ ప్రవాహం పశ్చిమ కనుమల వైపు కదిలి, అక్కడి భౌగోళిక పరిస్థితులతో కలిసి కేరళలో కొద్దిరోజుల వ్యవధిలో అత్యంత భారీ వర్షాలకు కారణమైంది. అనంతరం 2019, 2020ల్లోనూ, అలాగే కేరళలో ఇటీవలి కాలంలో సంభవించిన కొన్ని భారీ వర్షాలు, వరదల్లోనూ వాతావరణ నదుల ప్రభావాన్ని పరిశోధకులు పరిశీలించారు.

పెరుగుతున్న ముప్పు

వాతావరణ మార్పులతో ఈ అదృశ్య నదుల ప్రభావం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ వాతావరణం మరింత నీటి ఆవిరిని నిల్వ చేసుకోగలదు. క్లాసియస్-క్లాపెరాన్ సంబంధం ప్రకారం, ఉష్ణోగ్రత ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగినప్పుడు వాతావరణంలో సుమారు 7 శాతం అధిక నీటి ఆవిరి నిల్వ ఉండే అవకాశం ఉంటుంది.

అరేబియా సముద్రం వేడెక్కుతున్న కొద్దీ అక్కడి నుంచి భారతదేశం వైపు వచ్చే తేమ ప్రవాహాల్లో నీటి ఆవిరి పరిమాణం పెరగవచ్చు. ఫలితంగా తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదల ముప్పు పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వాతావరణంలోని తేమ పరిమాణం, దాని కదలికను అంచనా వేసే ఇంటిగ్రేటెడ్ వేపర్ ట్రాన్స్‌పోర్ట్ (IVT) వంటి ఆధునిక వాతావరణ నమూనాలను మరింత విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మన కళ్లకు కనిపించకపోయినా.. సముద్రం నుంచి భూమివైపు కదిలే ఈ ‘ఆకాశ నదులు’ భారీ వర్షాల రూపంలో తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. భవిష్యత్తులో వరదల ముప్పును తగ్గించాలంటే ఈ అదృశ్య తేమ ప్రవాహాలను ముందుగానే గుర్తించడం కీలకం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్