గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జింబాబ్వేలో ఘోర పడవ ప్రమాదం

1 రోజు క్రితం

boat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 07:33 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 15 మంది మృతి, 27 మంది గల్లంతు

- కొనసాగుతున్న గాలింపు చర్యలు

హరారే: జింబాబ్వేలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కరిబా సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 15 మంది మృతి చెందారు. మరో 27 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని జింబాబ్వే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రమాదం నుంచి 77 మందిని సహాయక బృందాలు రక్షించి సరస్సులోని ఓ చిన్న ద్వీపానికి తరలించాయి. వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి సహాయక పడవలను ఘటనా స్థలానికి పంపించారు.

పడవలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. టిక్కెట్ల విక్రయాల వివరాల ప్రకారం పడవలో 114 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. టిక్కెట్లు కొనుగోలు చేయాల్సిన వయస్సు లేని చిన్నారులు కూడా పడవలో ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కేవలం 90 మంది మాత్రమే ప్రయాణించేందుకు అనుమతించిన పడవలో ఇంతమంది ప్రయాణించడం ప్రమాద తీవ్రతను మరింత పెంచినట్లు తెలుస్తోంది.

గల్లంతైన వారి కోసం కరిబా సరస్సులో గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లు, స్పీడ్‌బోట్ల సహాయంతో సహాయక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. జింబాబ్వే ప్రభుత్వ ప్రసార సంస్థ విడుదల చేసిన దృశ్యాల్లో బోల్తా పడిన పడవ వైపు స్పీడ్‌బోట్లు వెళ్తుండగా, ఓ హెలికాప్టర్ గగనతలం నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కనిపించింది. సరస్సు అడుగు భాగంలో గాలింపు చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా రంగంలోకి దించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాలకు పడవ రవాణా ఆధారం

గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరిబా పట్టణానికి ప్రయాణించేందుకు ఈ పడవ రవాణాపైనే ఆధారపడతారని స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి తెలిపారు.

జింబాబ్వే, జాంబియా సరిహద్దులో కరిబా సరస్సు విస్తరించి ఉంది. సంబేసి నదిపై ఆనకట్ట నిర్మించడం ద్వారా ఏర్పడిన ఈ సరస్సు ప్రపంచంలోని అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటిగా ఉంది. ఇది 200 కిలోమీటర్లకు పైగా పొడవు, కొన్ని ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వరకు వెడల్పు కలిగి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్