- 17 మందికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్‌లో మూడు అంతస్తుల భవనంలో కొంత భాగం కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానించడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్లాట్‌బుష్ ప్రాంతంలోని బెడ్‌ఫోర్డ్ అవెన్యూ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల భవనంలోని కొంత భాగం కూలిపోవడంతో పాటు, పక్కనే ఉన్న మరో భవనం గోడ కూడా దెబ్బతింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వెల్లడించారు. గాయపడిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. సహాయక బృందాలు శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్, డ్రోన్లను వినియోగించాయి. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత ఒక వ్యక్తిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం. గాయపడినవారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రమాదానికి గురైన భవనం సమీపంలో నిర్మాణ పనుల కోసం పైలింగ్ కార్యకలాపాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలో అక్కడ ఒక అంతస్తు భవనం ఉండగా, దానిని తొలగించారు. మూడు అంతస్తుల భవనానికి అనుమతి లభించినప్పటికీ, తొమ్మిది అంతస్తుల భవనం నిర్మించినట్లు సమాచారం.








కామెంట్‌లు (0)