ఒట్టావా: వైద్య చికిత్సలు, వివిధ రకాల పరీక్షల కోసం పేరు నమోదు చేసుకుని సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి రావడంతో, కెనడాలో 2025-26 సంవత్సరంలో 29,468 మంది ప్రాణాలు కోల్పోయారు. శస్త్రచికిత్సలు, స్కానింగ్‌లు, నిపుణులైన వైద్యుల పరీక్షల కోసం ఎదురుచూస్తున్న వారే మృతులలో అత్యధికంగా ఉన్నారు.
2018 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు సకాలంలో వైద్యం అందక ఈ విధంగా 1,29,892 మంది మరణించారు. చాలా ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయి వివరాలను వెల్లడించకపోవడంతో అసలు మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ థింక్ ట్యాంక్ 'SecondStreet.org' విడుదల చేసిన 'డైడ్ ఆన్ ఏ వెయిటింగ్ లిస్ట్' (Died on a Waiting List) నివేదికలో కెనడా ఆరోగ్య రంగంలోని ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.
శస్త్రచికిత్సల కోసం వేచి ఉండగా సంభవించిన మరణాలలో 17.5 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు, స్కానింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న వారి మరణాల రేటులో 2.8 శాతం తగ్గుదల కనిపించింది. ఒక వారం లోపు వేచి ఉన్నవారి నుండి సంవత్సరాల తరబడి చికిత్స కోసం నిరీక్షించిన వారి వరకు మృతులలో ఉన్నారు. గుండె శస్త్రచికిత్స వంటి అత్యవసర చికిత్సల కోసం ఎదురుచూస్తున్న వారితో పాటు కంటి శుక్లాల (కేటరాక్ట్) ఆపరేషన్ వంటి వాటి కోసం వేచి ఉన్నవారు కూడా వీరిలో ఉన్నారు.
ఈ వ్యవహారంలో కెనడా ప్రభుత్వంపై SecondStreet.org అధ్యక్షుడు కోలిన్ క్రెయిగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక రెస్టారెంట్‌లో పేపర్ టవల్స్ లేకపోయినా ప్రభుత్వాలు ఆ విషయాన్ని బహిరంగపరుస్తాయని, కానీ ఆసుపత్రులలో చికిత్స కోసం వేచి ఉంటూ ఎంతమంది మరణిస్తున్నారనే గణాంకాలను మాత్రం బయటపెట్టడం లేదని ఆయన ఆరోపించారు. ప్రతి సంవత్సరం ఈ వివరాలను ప్రభుత్వం కచ్చితంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)