సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మిసిసిపి నదిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

14 నవంబర్, 2026

మిసిసిపి నదిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
- ట్యాంకర్​ ఢీకొని ఐదు అంతస్తుల నౌక బోల్తా 
- క్ష‍ేమంగా బయటపడ్డ ప్రయాణికులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ట్యాంకర్​ ఢీకొని ఐదు అంతస్తుల నౌక బోల్తా

- క్ష‍ేమంగా బయటపడ్డ ప్రయాణికులు

న్యూ ఓర్లీన్స్ : అమెరికాలోని మిసిసిపి నదిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎనిమిది రోజుల జలవిహారాన్ని ముగించుకుని ఒడ్డున ఆగి ఉన్న ఐదు అంతస్తుల క్రూయిజ్ బోటును ఓ భారీ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. చూస్తుండగానే క్రూయిజ్ బోటు ఆ నదిలో బోల్తా పడుతుండటంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో నీటిలో దూకేశారు. టైటానిక్ సినిమాలోని భయానక దృశ్యాలను తలపించిన ఈ ప్రమాదం నుంచి 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రాణాలు దక్కించుకునే క్రమంలో 32 మంది గాయపడ్డారని, వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని న్యూ ఓర్లీన్స్ మేయర్ హెలెనా మోరెనో తెలిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం..న్యూ ఓర్లీన్స్ పోర్టు సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.30 (భారత కాలమానం ప్రకారం..శుక్రవారం అర్ధరాత్రి) ఈ ప్రమాదం జరిగింది. విహారయాత్ర ముగించుకున్న అమెరికన్ హెరిటేజ్ అనే ఐదు అంతస్తుల క్రూయిజ్‌ షిప్‌ ప్రయాణికులను దించేందుకు పోర్టు వద్ద ఆగి ఉంది. అదే సమయంలో 520 అడుగుల పొడవైన అట్లాంటిక్ ఆస్ఫాల్ట్ అనే భారీ ట్యాంకర్ అదుపుతప్పి ఆ క్రూయిజ్ బోటును బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి విహార నౌకలోని అద్దాలు పగిలిపోగా టన్నుల కొద్దీ బరువున్న లోహపు నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ట్యాంకర్ ఢీకొట్టిన 15 నిమిషాల్లోనే క్రూయిజ్ బోటులోకి వేగంగా నీరు చేరి, ఓవైపు ఒరిగిపోయి నదిలో బోల్తా పడింది.

లైఫ్ జాకెట్లు ధరించి నదిలోకి దూకి..

నౌక తిరగబడుతుండటంతో అందులోని ప్రయాణికులు, సిబ్బంది కలిపి 180 మంది భయాందోళనకు గురయ్యారు. కొందరు నీటిలో పడిపోకుండా ఉండేందుకు బాల్కనీ రెయిలింగ్‌లను పట్టుకుని వేలాడగా మరికొందరు లైఫ్ జాకెట్లు ధరించి నదిలోకి దూకేశారు. వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డ్, పోర్టు సిబ్బంది, హార్బర్ పోలీసులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కొట్టుకుపోతున్న ప్రయాణికులను తాళ్ల సాయంతో సమీప నౌకల్లోకి లాగి రక్షించారు. ఈ ఘటనలో 32 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఇంతటి పెద్ద ప్రమాదంలో ప్రయాణికులందరూ బయటపడటం అద్భుతమేనని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఫోన్లు, గుర్తింపు కార్డుల వంటి కీలకమైన వస్తువులను చాలా మంది ప్రయాణికులు పోగొట్టుకున్నారు.

ప్రధాన వంతెనను ఢీకొట్టివుంటే..

ఈ ప్రమాదానికి కారణమైన ట్యాంకర్.. క్రూయిజ్‌ నౌకను కాకుండా అక్కడే ఉన్న ప్రధాన వంతెనను ఢీకొడితే పెద్ద ఘోరం జరిగేదని అధికారులు తెలిపారు. ఆ వంతెనపై నిత్యం 1.60 లక్షల వాహనాలు వెళతాయని తెలిపారు. ట్యాంకర్‌లో స్టీరింగ్ వ్యవస్థ విఫలం కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ భారీ ట్యాంకర్ రహదారుల నిర్మాణానికి వాడే తారును సరఫరా చేస్తుంటుంది.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్