- వైరల్‌గా ఘర్షణ వీడియో
అబుదాబి: మాజీ యూఎఫ్‌సీ బాంటమ్‌వెయిట్ ఛాంపియన్ మెరాబ్ ద్వాలిష్విలిపై అబుదాబిలోని ఓ హోటల్‌లో దాడి చేశారు. పీఎఫ్‌ఎల్ లైట్‌వెయిట్ ఛాంపియన్ ఉస్మాన్ నూర్మగోమెడోవ్, అతని అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని మెరాబ్ ఆరోపించారు. హోటల్ లాబీలో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యూఏఈలో ఈ వారాంతంలో జరగనున్న రియల్ అమెరికన్ ఫ్రీస్టైల్ (ఆర్ఏఎఫ్) పోటీలకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియోలో ఉస్మాన్ నూర్మగోమెడోవ్ వెనుక నుంచి మెరాబ్‌పై దాడి చేసినట్లు కనిపిస్తోంది. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు మెరాబ్‌తో పాటు అతనితో ఉన్న మరో యువకుడిపై దాడి చేయగా, పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారు.
ఈ ఘటన అనంతరం ముఖంపై రక్తంతో ఉన్న వీడియోను మెరాబ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను, తన స్నేహితుడు మాత్రమే అబుదాబికి వచ్చామని, ఉస్మాన్ నూర్మగోమెడోవ్, అతని సోదరుడు ఉమర్, వారి అనుచరులు కలిసి తనపై దాడి చేశారని తెలిపారు. తమ వైపు ఇద్దరే ఉండగా, ప్రత్యర్థి బృందంలో 12 నుంచి 15 మంది ఉన్నారని పేర్కొన్నారు.
''యోధులమని చెప్పుకునేవారు వెనుక నుంచి దొంగచాటుగా దాడి చేయడం ఏమిటి? నిజంగా పోరాడాలనుకుంటే నేరుగా రండి. మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గుంపుగా వచ్చి వెనుక నుంచి దాడి చేయడం పిరికిపంద చర్య'' అంటూ మెరాబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నేలపై పడిపోయిన తర్వాత కూడా దాడి కొనసాగిందని తెలిపారు. అయితే తనకు పెద్దగా గాయాలేమీ కాలేదని, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ ఘటనపై జార్జియాకు చెందిన మరో యూఎఫ్‌సీ స్టార్ ఇల్యా టోపురియా స్పందిస్తూ ఉస్మాన్ నూర్మగోమెడోవ్, అతని బృందాన్ని విమర్శించారు.
మరోవైపు యూఎఫ్‌సీ స్టార్ ఇస్లాం మఖాచెవ్ ఉస్మాన్‌కు మద్దతుగా నిలిచారు. గత జూలైలో జార్జియాలో జరిగిన ఓ ఆర్‌ఏఎఫ్ పోటీలో మెరాబ్.. డాగేస్తాన్‌కు చెందిన ఓ రెజ్లర్‌పై దాడి చేశారని ఆరోపించారు. అప్పట్లో మెరాబ్ చర్యలను విమర్శించని వారు ఇప్పుడు ఉస్మాన్ బృందాన్ని ఎందుకు తప్పుబడుతున్నారని ప్రశ్నించారు.
2025లో జరిగిన యూఎఫ్‌సీ 311లో మెరాబ్ ద్వాలిష్విలి, ఉమర్ నూర్మగోమెడోవ్ తలపడినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత జూలైలో జార్జియాలో జరిగిన ఆర్‌ఏఎఫ్ పోటీల సందర్భంగా చోటుచేసుకున్న మరో ఘర్షణ కూడా ఈ వివాదానికి కారణమైంది. తాజాగా అబుదాబిలో జరిగిన ఘటనతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత మరోసారి తెరపైకి వచ్చింది.








కామెంట్‌లు (0)