మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇజ్రాయిల్‌ ఆక్రమిత స్థావరాలతో వాణిజ్యం నిషేధం

1 గంట క్రితం

AFP__20260908__C7NC9X4__v1__HighRes__BritainIsraelPalestiniansDiplomacyTrade.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రకటించిన బ్రిటన్‌, మద్దతు తెలిపిన పలు దేశాలు

​లండన్ : అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్‌ అక్రమంగా వెస్ట్‌ ‌బ్యాంక్‌‌లో నిర్మిస్తున్న స్థావరాలతో వాణిజ్య కార్యకలాపాలను నిషేధిస్తున్నామని బ్రిటన్‌ ‌ప్రకటించింది. మంగళవారం బ్రిటన్‌ ‌విదేశాంగ మంత్రి ఎడ్‌ ‌మిలిబ్యాండ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఫ్రాన్స్, కెనడా కూడా బ్రిటన్‌తో చేతులు కలిపాయి. అలాగే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, ఐర్లాండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్‌లూ వాణిజ్య ఆంక్షలను సమర్ధిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

రెండు దేశాల ఏర్పాటే పరిష్కారం..

రెండు దేశాల ఏర్పాటు అవకాశాన్ని సజీవంగా ఉంచేందుకే ఈ చర్య తీసుకున్నామని బ్రిటన్ తెలిపింది. కెనడా, ఫ్రాన్స్ కూడా ఇలాంటి వాణిజ్య నిషేధంలో బ్రిటన్‌తో చేరాయని మంత్రి ఎడ్ మిలిబ్యాండ్ వెల్లడించారు. అక్రమ స్థావరాలపై కొత్త ఆంక్షల విధానం ఆరు నుండి తొమ్మిది నెలల్లో అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. స్థావరాల నిర్మాణానికి సహకరించే నిర్మాణ సంస్థలు, మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఈ ఆంక్షల పరిధిలోకి వస్తాయన్నారు. ఈ స్థావరాలు చట్టవిరుద్ధమైనవని బ్రిటన్ ప్రభుత్వ అధికారిక వైఖరిగా మిలిబ్యాండ్ ప్రకటించారు. అలాగే, ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వ హయాంలో గత నాలుగేళ్లలో నిర్మించిన రికార్డు స్థాయి స్థావరాలను, స్థావరవాసుల హింసను ఆయన ఎత్తిచూపారు. జెరూసలేంకు తూర్పున ఉన్న ‘ఇ1’ ప్రాంతంలో 1,200 స్థావరాల నిర్మాణానికి ఇజ్రాయిల్‌ టెండర్లు జారీ చేసింది. ఇలాంటి స్థావరం వెస్ట్ బ్యాంక్‌ను రెండు భాగాలుగా విడదీసి, నిరంతరాయ పాలస్తీనా రాజ్య ఏర్పాటును దాదాపు అసాధ్యం చేస్తుంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్‌లు ఆక్రమిత భూభాగాలుగా పరిగణించబడతాయి. ‘ఇ1’ ఆలోచన 1990లోనే తెరపైకి వచ్చినా, ఇతర దేశాల ఒత్తిడి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఈ నిర్ణయం సరికాదని ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు తెలిపారు. అక్టోబర్ చివర్లో జరగనున్న క్నెసెట్ ఎన్నికల్లో బ్రిటన్ జోక్యం చేసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్