గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసాకు హైకోర్టులో ఊరట

3 గంటల క్రితం

Cyril Ramaphosa .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 05:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జోహన్స్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై అభిశంసనకు దారితీసిన 2022 నాటి పార్లమెంటరీ కమిటీ నివేదికను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. కమిటీ తన చట్టబద్ధమైన పరిధిని దాటి వ్యవహరించిందని, తప్పుడు ప్రశ్నలు సంధించిందని, చట్టపరమైన తప్పిదాలకు పాల్పడిందని పేర్కొంటూ నివేదిక చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా జాతీయ అసెంబ్లీ తీసుకున్న చర్యలను కూడా సమీక్షించి రద్దు చేయవచ్చని న్యాయమూర్తి నోల్వాజీ మబిండ్లా-బోక్వానా వెల్లడించారు. 2020లో ఉత్తర లింపోపో ప్రావిన్స్‌లోని రమాఫోసా ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రం ఫాలా ఫాలాలో ఫర్నిచర్‌లో దాచిన 5.80 లక్షల డాలర్ల నగదు చోరీకి గురైంది. ఈ ఘటనను పోలీసులకు, పన్ను అధికారులకు తెలియకుండా దాచిపెట్టారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన స్వతంత్ర పార్లమెంటరీ కమిటీ.. రమాఫోసా తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడి ఉండవచ్చని నివేదిక ఇచ్చింది. అయితే, ఆయనపై అభిశంసనకు సంబంధించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది.

మాజీ గూఢచారి ఒకరు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. అయితే, తానెలాంటి తప్పు చేయలేదని రమాఫోసా ఖండించారు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ నగదు 20 గేదెల విక్రయం ద్వారా వచ్చిందని పేర్కొన్నారు. 2024లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆయనపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో మరోసారి ఆయనకు రాజకీయంగా ఊరట లభించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్