- మళ్ళీ మిలటరీ ఘర్షణలు తలెత్తే అవకాశం వుందన్న మధ్యవర్తులు
టెహ్రాన్ : ఇరాన్ వద్ద గల శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై తలెత్తిన వివాదంతో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తిరిగి మిలటరీ ఘర్షణలు పెచ్చరిల్లే అవకాశం వుందని మధ్యవర్తులు హెచ్చరిస్తున్నారు. తాము శుద్ధి చేసిన యురేనియం నిల్వలను సమూలంగా నిర్మూలిస్తామని, భవిష్యత్తులో మళ్లీ యురేనియంను శుద్ధి చేపట్టకుండా దూరంగా వుంటామని రాతపూర్వక హామీలివ్వాలని, స్పష్టమైన ప్రణాలికలు రూపొందించాలని అమెరికా పట్టుబడుతోంది. తమ అణు పదార్ధాన్ని దేశం వెలుపలకు తరలించేందుకు ఇరాన్ తిరస్కరిస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ అల్ అరబియా ఇంగ్లీష్ ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. ఇరు పక్షాల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు మధ్యవర్తులు ప్రతిపాదనలు చేశారు, అయినా ఇరు పక్షాలు ధృఢంగా తమ వైఖరులకే కట్టుబడ్డాయని ఆ కథనం పేర్కొంది.
ఇరాన్ అణు కార్యక్రమం భవిష్యత్‌పై ఇరు పక్షాలు ఒక అవగాహనకు రావాల్సివుండడంతో రెండు దేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభ కొనసాగుతోంది. ప్రస్తుతమున్న ఈ ప్రతిష్టంభనను పరిష్కరించడం కోసం అమెరికాతో ఒప్పందాన్ని అంగీకరించేది లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి చెప్పారు. ఏ ఒప్పందమైనా ఇరాన్ జాతీయ ప్రయోజనాలను కాపాడాల్సి వుందన్నారు. మరోసారి మిలటరీ ఘర్షణ జరగబోదని ముందస్తుగా హామీ ఇవ్వాలని కోరారు. అటు యుద్ధం కాదు ఇటు శాంతి కాదు అన్న రీతిలో పరిస్థితులు కొనసాగడం కుదరదని, గౌరవప్రదమైన, మంచిదైన, శాశ్వతమైన ఒక ఒప్పందం కావాలని ఇరాన్ బలంగా కోరుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో అరగ్చి పేర్కొన్నారు. తమ షరతులను అమెరికా నెరవేర్చిన పక్షంలో హర్మూజ్‌ను తిరిగి తెరవడానికి ఇరాన్ సుముఖంగా వుందని అరగ్చితెలిపారు. అమెరికాతో కుదుర్చుకునే ఏ దౌత్య ఒప్పందమైనా తమ అణు కార్యక్రమాలను, ఆంక్షలను, భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించాలని టెహ్రాన్ పట్టుబడుతోంది.








కామెంట్‌లు (0)