- పది మంది విద్యార్థులు మృతి
- 110 మందికి పైగా గాయాలు
కాబూల్ : తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో ఒక స్కూల్లో శనివారం పేలుడు సంభవించింది. ఉదయం 10 గంటలకు జరిగిన ఈ పేలుడులో పది మంది విద్యార్థులు చనిపోయారు. మరో 110 మంది పైగా గాయపడ్డారు. ఈ మేరకు కునార్ ప్రావిన్స్ సమాచార శాఖ డైరెక్టర్ తెలిపారు. సమీపాన పేలుడు పదార్ధాల డిపో కారణంగా ఈ దారుణం జరిగినట్లు కనిపిస్తోందని చెప్పారు. ప్రావిన్స్ రాజధాని అసదాబాద్ శివార్లలో ఈ పాఠశాల వుంది. మైనింగ్ కంపెనీలకు చెందిన పేలుడు పదార్ధాలను నిల్వ చేసే ఈ డిపోలో నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాధమికంగా తెలుస్తోందని డైరెక్టర్ శామ్యూల్ హక్ బయాన్ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. గాయపడిన వారిలో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు చికిత్స అనంతరం వెళ్లిపోయారని తెలిపారు. పేలుడు ధాటికి స్కూల్లో ఒక భాగం పూర్తిగా కుప్పకూలింది. కార్లలో పిల్లలను ఆస్పత్రులకు తీసుకువస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.








కామెంట్‌లు (0)