- ప్రార్థనలు చేస్తుండగా దుర్ఘటన
క్విటో: చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా ఆకస్మాత్తుగా సిలువ మీద పడి ఫాదర్ మృతి చెందిన విషాద సంఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రార్థనలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలో ఈ దారుణం జరగడంతో దీన్ని చూసిన వారంతా భీతావశులయ్యారు. ఈక్వెడార్ దక్షిణ నగరమైన గ్వాయాక్విల్‌లోని ‘అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్’ చర్చిలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. 53 ఏళ్ల ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మొలినారి, బలిపీఠం దగ్గర నిలబడి ఉండగా వెనుక గోడకు అమర్చిన చెక్క శిలువ అకస్మాత్తుగా ఆయనపై పడింది. ప్రార్థనలు ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత ఈ సంఘటన జరగడంతో, అక్కడున్న భక్తులు దిగ్భ్రాంతికి గురై తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. గ్వాయాక్విల్ ఆర్చిడియోసెస్ ఒక అధికారిక ప్రకటనలో ఫాదర్ మరణాన్ని ధృవీకరించింది. ‘‘ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని, ఆయన కుటుంబానికి, కుటుం సభ్యులకు, స్నేహితులకు తమ సంఘీభావం, ఆప్యాయత మరియు ప్రేమను తెలియజేస్తున్నామని’’ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈక్వెడార్ అధికారులు ఈ సంఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే, శిలువ పడిపోవడానికి గల కారణం ఇంకా వెల్లడికాలేదు.







కామెంట్‌లు (0)