శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెంటగాన్ అగ్ర సైనిక ప్రణాళికాధికారిని తొలగించిన రక్ష‍ణమంత్రి

29 అక్టోబర్, 2026

Hegseth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 11:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : లెఫ్టినెంట్ జనరల్ బ్రెట్ సిల్వియాను పెంటగాన్ అగ్ర సైనిక ప్రణాళికాధికారి పదవి నుండి తొలగించినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం తెలిపారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో వ్యూహం, ప్రణాళికలు, విధానాల విభాగాధిపతిగా ఉన్న ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ బ్రెట్ సిల్వియాను తొలగించారు. ఆయనను సైనిక వర్గాలు ‘‘జె5’’గా పేర్కొంటాయి. ఈ పదవి నుండి తొలగింపునకు గురైన రెండవ జనరల్ ఈయనే. ఆయనకు ముందున్న లెఫ్టినెంట్ జనరల్ జోసెఫ్ మెక్‌గీ, గత అక్టోబర్‌లో పదవీ విరమణ చేయవలసి వచ్చింది. లెఫ్టినెంట్ జనరల్ బ్రెట్ సిల్వియా, ఆయన కుటుంబం దేశానికి 32 సంవత్సరాల పాటు విశిష్ట సేవ చేశారని, ఆ కృషికి గాను చైర్మన్, జాయింట్ స్టాఫ్, జాయింట్ ఫోర్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయని జాయింట్‌ స్టాఫ్‌ ప్రతినిధి తెలిపారు. సిల్వియా ‘జాయింట్ స్టాఫ్'లో చేరడానికి ముందు, కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్‌లో 101వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు కమాండర్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన 'జె5' విభాగంలో వైస్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. సాధారణంగా, జె5 డైరెక్టర్, వారి సిబ్బంది, జాయింట్ చీఫ్స్ చైర్మన్ అధ్యక్షుడితో కలిసి సైనిక ప్రణాళికలను రూపొందించి, సమన్వయం చేసే బాధ్యతను కలిగి ఉంటారు. ఇరాన్‌పై కొత్త సైనిక చర్యలను ప్రారంభించే విషయాన్ని ట్రంప్ పదేపదే ప్రస్తావిస్తున్న తరుణంలో సిల్వియాను తొలగించడం గమనార్హం. సిల్వియా స్థానంలో మరొకరిని నియమించలేదని, ఆయన తొలగింపుకు గల కారణం కూడా వెల్లడించలేదని రక్ష‍ణశాఖకు చెందిన ఒక వ్యక్తి తెలిపారు.


నవంబర్ 3న జరగనున్న ఎన్నికల తర్వాత, తిరిగి సైనిక చర్యలు మొదలయ్యే అవకాశం ఉందని, ఇద్దరు దౌత్యవేత్తలు తెలిపారు. ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించవచ్చని అమెరికా అధికారులు పశ్చిమాసియా దేశాలకు, ప్రాంతీయ మిత్రదేశాలను హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు. అయితే, కొత్త దాడుల విషయంలో ట్రంప్ ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మరో అమెరికా విమాన వాహక నౌకతో పాటు వేలాది మంది అదనపు సైనికులు ఆ ప్రాంతానికి తరలి వెళ్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్