- ప్రపంచంలోనే ఎత్తైన భవనంపై క్షిపణి ప్రయోగం
రియాద్ : యెమెన్‌కు చెందిన హౌతీల తిరుగుబాటు గ్రూప్ గురువారం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అత్యంత ఎత్తైన భవనంపై దాడి చేసింది. సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్ కార్యాలయం ఉన్న ఈ భవనం కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పిఐఎఫ్) టవర్ అని ఆదేశ మీడియా వెల్లడించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడితో భవనంలోని పలు అంతస్తులు తీవ్రంగా దెబ్బతీన్నాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రఖ్యాత ఆర్థిక కేంద్రంలోని ఒక టవర్‌ను క్షిపణి తాకిందని, దీంతో ఆ టవర్‌లోని పలు అంతస్తులతో పాటు సమీప భవనాలకు కూడా మంటలు వ్యాపించి ఆస్తి నష్టం జరిగిందని సౌదీ పౌర రక్షణ విభాగం (సివిల్ డిఫెన్స్) ప్రకటించింది. రెండు వారాల వ్యవధిలోపే రియాద్‌లో భవనాలపై హూతీలు దాడి చేయడం ఇది రెండోసారి. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ ఆరామ్‌కో భవనం ఈ నెల 8న దాడికి గురైంది. ఈ దాడుల నేపథ్యంలో తన సార్వభౌమత్వాన్ని, పౌరులను, జాతీయ ఆస్తులను కాపాడుకోవడానికి ‘‘అవసరమైన అన్ని చర్యలు’’ తీసుకుంటామని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ తెలిపింది. యెమెన్‌లోని హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై సౌదీ భారీ వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో, ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.








కామెంట్‌లు (0)