- ఒక్క రాత్రిలో 30 లక్షలకు పైగా మెట్రో ప్రయాణాలు
- హాజరైన ఖమేనీ కుమారులు
టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యానంతరం జరుగుతున్న అంత్యక్రియల ఊరేగింపు సందర్భంగా, లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. టెహ్రాన్‌లో ఒక్క రాత్రిలోనే 30 లక్షలకు పైగా మెట్రో ప్రయాణాలు నమోదైనట్లు మీడియా నివేదించింది. 13 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఖమేనీ కుమారుల భావోద్వేగం
సుప్రీం లీడర్ ఖమేనీ కోసం జరిగిన ప్రార్థనల్లో ఆయన కుమారులు మసూద్, మేసమ్, మోస్తఫా పాల్గొన్నారు. వీరితో పాటు ఐఆర్‌జిసి కమాండర్ అహ్మద్ వహీది కూడా హాజరయ్యారు. ఇజ్రాయిల్ నుంచి తనకు ప్రాణహాని ముప్పు ఉందన్న భద్రతా కారణాల రీత్యా, ఖమేనీ కుమారుడు, వారసుడు అయిన మొజ్తబా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన కుమారులు భావోద్వేగానికి లోనైయ్యారు. వారు కంటతడి పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
14 నెలల మనవరాలికి ప్రార్థనలు..
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడిలో ఖమేనీతో పాటు మృతిచెందిన ఆయన కుటుంబ సభ్యులు నలుగురికి కూడా ఆదివారం ప్రార్థనలు నిర్వహించారు. వీరిలో ఖమేనీ 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ గోల్పాయేగానీ కూడా ఉన్నారు. అంత్యక్రియల సందర్భంగా, తన తాత శవపేటిక పక్కనే ఆమె చిన్న శవపేటికను ఉంచిన దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది. ఆమె తండ్రి మొహమ్మద్ జవాద్ మొహమ్మదీ ఈ ప్రార్థనల్లో పాల్గొనగా, అదే దాడిలో ఆమె తల్లి బోష్రా ఖమేనీ కూడా మృతిచెందారు.
అంత్యక్రియలకు హాజరైన ఐఆర్‌జిసి చీఫ్ వహీది
ఈ అంత్యక్రియల ప్రార్థనలకు హాజరైన ప్రముఖుల్లో రివల్యూషనరీ గార్డ్ చీఫ్ బ్రిగేడియర్-జనరల్ అహ్మద్ వహీది కూడా ఉన్నారు. 1970ల చివర్లో ఐఆర్‌జిసి ఆవిర్భావం నాటి నుంచి వహీది కీలక సభ్యుడిగా ఉన్నారు. 1980వ దశకంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలిటరీలో కీలక పదవులు నిర్వహిస్తూ వహీది వరుసగా పదోన్నతులు పొందారు. 1988 నుంచి 1997 వరకు ఐఆర్‌జిసికి చెందిన ఎలైట్ ఖుద్స్ ఫోర్స్‌కు వహీది నేతృత్వం వహించారు. ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. ‘‘మనుషులను చంపగలరు, కానీ ఆదర్శాలను కాదు. మీరు అయతొల్లా ఖమేనీని చంపారు, కానీ వాస్తవానికి మీరు ఒక పరిమళ ద్రవ్యపు సీసాను పగలగొట్టారు, దాని సువాసన అన్నిచోట్లా వ్యాపించింది. మీకు నాగరికత లేదు, చరిత్ర లేదు, గౌరవం లేదు కాబట్టి మీకు ఈ విషయాలు అర్థం కావు.’’ అని సోషల్ మీడియాలో పేర్కొంది.








కామెంట్‌లు (0)