న్యూయార్క్ : మరణశిక్ష అమలుపై తాత్కాలిక నిషేధాన్ని విధించాలని దేశాలకు పిలుపునిచ్చే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జిఎ) తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. మెక్సికో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని శుక్రవారం యుఎన్‌జిఎ ఆమోదించింది. 133 దేశాలు అనుకూలంగా, 33 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా.. 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. భారత్‌తో పాటు అమెరికా, చైనా, జపాన్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. మరణశిక్షను రద్దు చేసే లక్ష్యంతో ఉరిశిక్షల అమలుపై తాత్కాలిక నిషేధం విధించాలని తీర్మానం అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే మరణశిక్షను రద్దు చేసిన దేశాలు తిరిగి దానిని ప్రవేశపెట్టవద్దని కోరింది. మరణశిక్షల అమలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నప్పటికీ, 2025లో వాటి సంఖ్య గణనీయంగా పెరగడంపై తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. మరణశిక్ష విధించగల నేరాల సంఖ్యను తగ్గించాలని, తప్పనిసరి మరణశిక్ష నిబంధనలను తొలగించాలని సూచించింది. నేరం జరిగినప్పుడు 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారికి మరణశిక్ష విధించరాదని, గర్భిణులు, మానసిక లేదా మేధోపరమైన వైకల్యాలున్న వ్యక్తులు, వృద్ధుల విషయంలో మరణశిక్ష వినియోగాన్ని పరిమితం చేయాలని కోరింది.
మరణశిక్షపై యుఎన్ తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు
15 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 11:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)