రియాద్ : సౌదీ అరేబియా దమ్మమ్లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించారు. బుధవారం రాత్రి దమ్మమ్లోని విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించారని, వారిలో ఒకరు భారతీయుడని రియాద్‌లోని భారతరాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
విమానాశ్రయంపై దాడిలో గాయపడిన వారి సంఖ్య ఎనిమిదికి చేరిందని సౌదీ అరేబియాకు చెందిన జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులు, ఇద్దరు యెమెన్ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశ్‌కి చెందిన వారు కాగా మరో ఇద్దరు సౌదీ, నేపాల్‌కు చెందినవారని తె లిపింది. నష్టాన్ని అంచనా వేయడానికి, ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టామని, విమానాశ్రయం భద్రతపై సంబంధిత అధికారులతో పూర్తి చర్చలు జరుపుతున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. దాడి అనంతరం విమానాశ్రయ కార్యకలాపాలను పునరుద్ధరించామని, సాధారణ పరిస్థితి నెలకొందని తెలిపింది.
గల్ఫ్ ప్రాంతం అంతటా అమెరికా తన సిబ్బందిని ఉపసంహరించుకుంటోందంటూ వచ్చిన మీడియా కథనాలను అమెరికా విదేశాంగ శాఖ ఖండించింది. అత్యవసర అవసరం లేని సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తిరిగి వెళ్లిపోవాలనే ఆదేశం, కేవలం సౌదీ అరేబియాలోని అమెరికా దౌత్య కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. గల్ఫ్ ప్రాంతంలోని పలు రాయబార కార్యాలయాల నుంచి సిబ్బందిని వెనక్కి పిలిపించేందుకు అమెరికా సిద్ధమవుతోందంటూ వచ్చిన వార్తలను, విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ ఖండించారు. హౌతీలు సౌదీలోని విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు చేపడుతున్నారని అన్నారు.
ఈ నెల 11న ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు స హా 13మంది మరణించిన సంగతి తెలిసిందే.








కామెంట్లు (0)