సీమైన్ ఢీకొనడంతో మునిగిన నౌక
దుబాయ్ : హర్మూజ్ జలసంధిలో ఐఫోన్లు కుప్పలు..కుప్పలుగా తేలియాడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇరాన్‌కు చెందిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జిసి) గురువారం ఒక ప్రకటన చేసింది. సీ మైన్‌ను ఢీకొట్టి ఒక నౌక మునిగిపోయిందని, అందులోని సరుకులు జలమయమయ్యాయని ఐఆర్‌జిసి తెలిపింది. చట్ట విరుద్ధమైన, ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్న క్రమంలో నౌక మునిగిపోయిందని ఐఆర్‌జిసి పేర్కొంది. ఇలా ఒక నౌక మునిగిపోయిందని నిర్ధారించి ఐఆర్‌జిసి ప్రకటించడం ఇదే తొలిసారి. కాగా ఈ మునిగిపోయిన నౌక దాదాపు 2500 కంటైనర్లతో వెళ్తున్నట్లు సమాచారం. వీటిలో ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూమ్ బాటిళ్లు, తదితర వస్తువులున్నాయి. ప్రమాదం అనంతరం కంటైనర్లు చెల్లాచెదురు కావడంతో ఐఫోన్‌లతో సహా ఇందులో ఉన్న వస్తువులు కుప్పలుగా నీటిపై తేలియాడుతున్నాయి. జిఎఫ్‌ఎస్ ప్రైడ్ అనే సింగపూర్ జెండా ఉన్న నౌక దుబాయ్ నుంచి ఈ సరకులను తీసుకువెళ్తున్నట్లు సమాచారం. కాగా, సరుకు రవాణా నౌక మునిగిపోయిన విషయాన్ని ముందుగా సింగపూర్ పోర్టు అధికారులు వెల్లడించారు. హర్మూజ్ మార్గంలో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వస్తువులను సింగపూర్‌కు చెందిన రెండు సరకు రవాణా నౌకలు ఢీకొన్నాయని నౌకాశ్రయ అధికారులు తొలుత పేర్కొన్నారు. ఇందులో ఒకటి మునిగిపోగా.. మరొకటి సురక్షితంగా గమ్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. అలాగే, మునిగిపోయిన నౌకలోని సిబ్బంది అందర్నీ సురక్షితంగా తరలించామని చెప్పారు.








కామెంట్‌లు (0)