న్యూయార్క్ : అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో దెబ్బతిన్న అణు కేంద్రాలను మరమ్మతు చేయడానికి లేదా పునరుద్ధరించడానికి ఇరాన్ ప్రయత్నించినట్లు ఎలాంటి సంకేతాలు లేవని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) అధ్యక్షుడు రాఫెల్ గ్రోస్సీ తెలిపారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దెబ్బతిన్న అణు కేంద్రాలతోపాటు ఇరాన్‌లోని అన్ని అణు స్థావరాలను తనిఖీ చేసేందుకు తమ అధికారులను అనుమతించాలని కోరారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందన్న ఆరోపణలతో అమెరికా ఆ దేశంపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే. 2025 జూన్‌లో అమెరికా జరిపిన దాడులు ఇరాన్ అణు కేంద్రాలను తీవ్రంగా దెబ్బతీశాయని గ్రోస్సీ పేర్కొన్నారు. అయితే, ఆ దాడుల తర్వాత ఇరాన్‌లో యురేనియం నిల్వల పరిస్థితిని ధ్రువీకరించలేకపోయామని ఐఎఇఎ తెలిపింది. 2025, 2026లో జరిగిన దాడుల్లో దెబ్బతిన్న అణు కేంద్రాల మరమ్మతులు లేదా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు కూడా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని గ్రోస్సీ వెల్లడించారు. అణు నిరాయుధీకరణ బాధ్యతలను ఇరాన్ ఉల్లంఘించిందని ఐఎఇఎ ప్రకటించిన నేపథ్యంలో, బహ్రెయిన్, డెన్మార్క్, లాట్వియా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా మంగళవారం భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మౌనం వహించడాన్ని ఐరాసలో ఇరాన్ ఉప రాయబారి ఘోలమ్‌హొస్సేన్ దర్జీ తీవ్రంగా విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా దురాక్రమణ సాగిస్తోందని అన్నారు. ఇరాన్ ప్రజలపై అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు, ఇరాన్ తన అణు కార్యకలాపాలపై ఐఎఇఎ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అమెరికా ప్రతినిధి మైక్ వాల్ట్జ్ పేర్కొన్నారు. ఇరాన్ తన వాదనలను సమర్థించుకోవడం కంటే, సంస్థకు సహకరించి వాస్తవాలను వెల్లడించాలని అన్నారు.








కామెంట్‌లు (0)