- 11 మంది మృతి, 17 మందికి గాయాలు
బ్యాంకాక్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫుకెట్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మోటారుసైకిల్ దుకాణం ఉన్న భవనంలో మంటలు చెలరేగాయి. భవనం కింది అంతస్తులో దుకాణం ఉండగా, పై అంతస్తులను నివాస ప్రాంతాలుగా ఉపయోగిస్తున్నారు. మంటలు వేగంగా ఇతర అంతస్తులకు వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫుకెట్ గవర్నర్ చోడ్నారిన్ కోడ్సోమ్ తెలిపిన వివరాల ప్రకారం, దుకాణంలో సుమారు 100 మోటారుసైకిళ్లు ఉన్నాయి. గ్యాస్, ఇంజిన్ ఆయిల్, ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు వంటి మండే పదార్థాలనూ అక్కడ నిల్వ ఉంచారు. వీటి వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. అనంతరం మూడో అంతస్తులో ఒక మృతదేహాన్ని, ఐదో అంతస్తులో మరో పది మృతదేహాలను గుర్తించారు. మంటలు, పొగ నుంచి తప్పించుకునేందుకు కొందరు పై అంతస్తులకు వెళ్లి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే బాధితులు మరణించిన పరిస్థితులపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని, ప్రాథమిక దర్యాప్తులో భవనం సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలినట్లు అనుమానిస్తున్నప్పటికీ, అదే మంటలకు కావోచ్చని ఫుకెట్ పోలీస్ కమాండర్ సురాచాయ్ సూక్సాయ్ తెలిపారు. మృతుల గుర్తింపు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.








కామెంట్‌లు (0)