- సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాటానికి పిలుపు
ఏథెన్స్: యూరప్ కమ్యూనిస్టు యువజన సంస్థల 20వ సమావేశం (ఎంఇసివైఒ) గ్రీస్ రాజధాని ఏథెన్స్లో సోమవారం ముగిసింది. గత రెండు రోజులుగా 20 కమ్యూనిస్టు యువజన సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సామ్రాజ్యవాద యుద్ధం, పెట్టుబడిదారీ దోపిడీ, కమ్యూనిస్టు వ్యతిరేక అణచివేతలకు వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది.
గ్రీస్ కమ్యూనిస్టు యువజన సంఘం (కెఎన్‌ఇ) ఆతిథ్యమిచ్చిన ఈ సమావేశం, గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రతినిధులు సమ్మెలు, విద్యార్థి ఉద్యమాలు, గృహ సమస్యలపై ప్రచారాలు, సైనిక నియామకాలకు వ్యతిరేక నిరసనలు, పాలస్తీనా, క్యూబాలకు సంఘీభావ కార్యక్రమాల్లో తమ అనుభవాలను పంచుకున్నారు. యూరప్ ప్రభుత్వాలు సైనికీకరణను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలను, ప్రభుత్వ అణచివేతను యువజన సంస్థలు ఎలా ఎదుర్కొంటున్నాయో వివరించే సెమినార్ కూడా నిర్వహించారు. ప్రతినిధులు చారిత్రక ఏథెన్స్ పాలిటెక్నిక్‌లో జరిగిన అంతర్జాతీయ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీస్‌లో సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా 1973 నవంబర్‌లో జరిగిన తిరుగుబాటుకు 53 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహించారు. ఎఎన్ఇ ప్రధాన కార్యదర్శి థోడోరిస్ కోట్సాంటిస్ ప్రధాన ప్రసంగం చేశారు. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, టర్కీల ప్రతినిధులు సభకు శుభాకాంక్షలు తెలిపారు. నియంతృత్వ వ్యతిరేక పోరాట యోధులు కూడా హాజరయ్యారు. "చరిత్ర వర్గపోరాటం ద్వారానే రాయబడుతుంది" అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో, మంగళవారం అమెరికా రాయబార కార్యాలయం వైపు జరిగే సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోట్సాంటిస్ పిలుపునిచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి సోషలిజం కోసం సంఘటితం కావాలని యువతను కోరారు. ఎఎన్ఇ కళాకారులు ఆ తిరుగుబాటుతో ముడిపడిన పాటలను, ప్రపంచవ్యాప్త పోరాటాల గీతాలను ఆలపించింది.








కామెంట్లు (0)