- కొట్టుకుపోయిన కార్లు.. ఆరుగురికి గాయాలు
చిలీ: దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాజధాని శాంటియాగోతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా శాంటియాగోలోని లాస్ కొండెస్ ప్రాంతంలో రహదారులపైకి భారీగా బురద నీరు ప్రవహించడంతో వాహనాలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. రోడ్లపై వెళ్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొని గుట్టలుగా పేరుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి పరిస్థితుల తీవ్రతను వెల్లడిస్తున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో పలువురు నివాసితులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ ఘటనలో కనీసం ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. లాస్ కొండెస్ ప్రాంతంలో కొద్ది సమయంలోనే సుమారు 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో మ్యాపోచో నది పొంగిపొర్లడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి, ఖాళీ చేయించే చర్యలు చేపట్టారు. మరో పది ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు చిలీ అధ్యక్షుడు జోస్ ఆంటోనియో కాస్ట్ లాస్ కొండెస్ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.







కామెంట్‌లు (0)