గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅణు భద్రత, రక్ష‍ణకు బహుళపక్ష‍ భాగస్వామ్యం

19 గంటల క్రితం

HRG0PWEbcAAmNib.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎస్‌సిఒ డిక్లరేషన్‌

బిష్కేక్‌ : అణు భద్రత, రక్షణలకు బహుళ పక్ష భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై డిక్లరేషన్‌‌ను షాంఘై సహకార సంస్థ (ఎస్‌‌సిఓ) దేశాధినేతల మండలి మంగళవారం ఆమోదించింది. ఒక దేశం తన అణు భద్రతకు సంబంధించిన పూర్తి బాధ్యతను భరిస్తుందని, అలాగే అణు రక్షణకు సంబంధించిన బాధ్యత ఆ అణుకేంద్రం నిర్వాహక సంస్థపైన, ఆ కేంద్రం వున్న దేశంపైన వుంటుందని ఎస్‌‌సిఓ సభ్య దేశాలు ఆ డిక్లరేషన్‌‌లో ధృవీకరించాయి.

అణు పదార్ధాలు, ఇతర అణు ధార్మికత గల పదార్ధాలు అక్రమంగా రవాణా అవుతుండడంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు సభ్య దేశాలు పేర్కొన్నాయి. అలాగే అణు కేంద్రాలకు, మౌలిక వసతులకు (కంప్యూటర్‌ ‌భద్రతతో సహా), బెదిరింపులు, అణు ఉగ్రవాద ముప్పుల పట్ల కూడా ఆందోళన చెందుతున్నామని ఆ దేశాలు డిక్లరేషన్‌‌లో పేర్కొన్నాయి.

శాంతియుత ప్రయోజనాల కోసం పనిచేసే అణు కేంద్రాలపై దాడులకు దిగడం అలాగే దాడులకు పాల్పడతామనే బెదిరింపులకు దిగడాన్ని కూడా సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని పేర్కొన్నాయి. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ముప్పుగా పరిణమిస్తున్న ఇలాంటి చర్యలకు దూరంగా వుండాలని సభ్య దేశాలు పిలుపిచ్చాయి. అణు ధార్మికత వెలువడే అత్యవసర పరిస్థితులను నివారించేందుకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడం అవశ్యమని సభ్య దేశాలు భావిస్తున్నాయి. అణు పదార్ధాలను, అణు ధార్మికత వెలువడే పరికరాలను భౌతికంగా భద్రపరచడం, సంబంధిత కేంద్రాలను కాపాడే చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమని ఆ డిక్లరేషన్‌ ‌పేర్కొంది. అణు ధార్మిక పదార్ధాలకు దేశీయంగా నియంత్రణా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని సభ్య దేశాలు ఆ డిక్లరేషన్‌‌లో పిలుపిచ్చాయి. అణు కేంద్రాలను సురక్షితంగా నిర్వహించే రంగంలో అత్యంత అధునాతన పద్దతులపై పరస్పర మార్పిడులు జరుపుకోవడం, సహకారాన్ని విస్తరించుకోవడం, శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక ప్రాజెక్టులపై చైతన్యాన్ని పెంచుకోవడం వంటి చర్యలు చేపట్టాలని డిక్లరేషన్‌ ‌పిలుపిచ్చింది. సున్నితమైన సమాచారం గోప్యతను పాటిస్తూనే, వాస్తవ కాల నమూనాలు, సమాచారాన్ని విశ్లేషించుకోవడం, సాంకేతిక డేటాను పంచుకోవడం, అవసరమైనపుడు ముందస్తు హెచ్చరికా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, సభ్య దేశాల మధ్య శిక్షణ నిర్వహించుకోవడానికి సభ్య దేశాలు అంగీకరించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్