ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అల్బేనియా సదస్సును రద్దు చేసిన నాటో

16 నవంబర్, 2026

nato
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 11:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అమెరికా, ఈయూ దేశాల మధ్య ఉద్రిక్తతలే కారణం

టిరానా : వచ్చే ఏడాది అల్బేనియా రాజధాని టిరానాలో జరగాల్సిన నాటో నేతల శిఖరాగ్ర సదస్సు రద్దయింది. సదస్సు నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని అల్బేనియా ప్రధాని ఎడి రామా చెప్పారు. అమెరికా, దాని యూరోపియన్‌ నాటో మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. యూరోపియన్‌ నాటో మిత్రదేశాలు రక్షణ వ్యయాన్ని పెంచుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యకు మద్దతు ఇవ్వడానికి ఆ దేశాలు నిరాకరించడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో శిఖరాగ్ర సదస్సు ఎప్పుడు జరపాలన్న విషయంపై ఇంకా సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, అయితే వచ్చే ఏడాది మాత్రం ఆ సమావేశం జరిగే అవకాశమే లేదని రామా స్పష్టం చేశారు. ఒకవేళ 2028లో సమావేశం జరిగితే అది టిరానాలోనే ఉంటుందని ఆయన తెలిపారు.

మొక్కుబడి తంతుగా భేటీలు

నాటో సెక్రటరీ-జనరల్‌ మార్క్‌ రుట్టే ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకున్నారు. సదస్సును నాటో కూటమి ఎప్పుడైనా నిర్వహించవచ్చునని, అవసరమైనప్పుడు ఆ పని చేస్తుందని ఆయన చెప్పారు. గత సంవత్సరం హేగ్‌లో నాటో శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ ఏడాది టర్కీలోని అంకారాలో, వచ్చే ఏడాది అల్బేనియాలోని టిరానాలో సదస్సులు జరపాలని నిర్ణయించారు. అయితే అంకారా సదస్సు తర్వాత జారీ చేసిన పత్రంలో టిరానా ప్రస్తావన కన్పించలేదు. సాధారణంగా నాటో సభ్యదేశాలు ప్రతి ఏటా వార్షిక సమావేశాలు నిర్వహిస్తుంటాయి. దీనికి భిన్నంగా అవసరమైనప్పుడు మాత్రమే సమావేశాలను నిర్వహించాలని సభ్యదేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్‌తో ఘర్షణ వైఖరిని నివారించాలని అవి కోరుకుంటున్నాయి. నాటో మంత్రుల స్థాయి సమావేశాలను కూడా పరిమితం చేశారు. అక్టోబరులో రక్షణ దళాల అధిపతుల భేటీ జరగాల్సి ఉండగా దానిని రద్దు చేశారు. వచ్చే ఏడాది కూడా ఆ సమావేశం జరిగే అవకాశాలు లేవు. వచ్చే సంవత్సరం విదేశాంగ మంత్రులు రెండుసార్లు సమావేశం కావాల్సి ఉండగా ఒకసారే సమావేశమవ్వాలని నిర్ణయించారు. గతంలో జరిగిన సమావేశాలు కూడా మొక్కుబడి తంతుగా సాగాయి. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు ఈ సమావేశాలకు హాజరు కాకపోవడమో లేదా కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోవడమో జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్