లాగోస్ : నైజీరియాలో ప్రస్తుత ఎబోలా వ్యాప్తిలో మొదటి కేసు బండిబుగ్యో వైరస్ రకంగా నిర్ధారణ అయింది. వ్యాధి సోకిన వ్యక్తి ఒక దౌత్యవేత్త అని అధికారులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు.
మూడు దశల్లో పరీక్షలు నిర్వహించామని, అన్నీ మాలిక్యులర్ పరీక్షలేనని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఎన్‌సీడీసీ)లోని పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ సర్వీస్ డైరెక్టర్ ఒలాజుమోకే బాబతుండే తెలిపారు. పరీక్షల్లో బండిబుగ్యో వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ రకం కూడా ఇదేనని వివరించారు. వ్యాధి సోకిన దౌత్యవేత్త ఆరోగ్యం క్షీణించిందని, బహుళ అవయవాల వైఫల్యం సంభవించినట్లు మరో అధికారి వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
డబ్ల్యుహెచ్‌ఒ ప్రకటన ప్రకారం, బాధితురాలు ఉగాండా నుంచి నైజీరియాలోని అబుజాకు వచ్చిన మహిళ. ఈ నెల 20న ఆమెకు ఎబోలా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో 44 మంది కాంటాక్టులను గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)