శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపుతిన్‌ విమానం శత్రుదుర్బేద్యం..

1 గంట క్రితం

putin plane.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 07:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బ్రిక్స్‌ కోసం భారత్‌కు ‘డూమ్స్‌డే ప్లేన్‌’

  • ఒకేసారి రెండు విమానాలు గాల్లో.. దేనిలో పుతిన్‌ ఉన్నారో తెలిసేది కేవలం భద్రతా బృందానికే!

​న్యూఢిల్లీ: బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం విస్తరణపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక భేటీ కూడా నిర్వహించారు. అయితే, ​ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేతల్లో ఒకరైన పుతిన్‌, ఉన్నతస్థాయి బృందంతో పాటు, ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన తీవ్ర భద్రతా చర్యల మధ్య భారత్‌కు చేరుకున్నారు. ఇందుకోసం ఆయన ఒకేలా ఉండే రెండు ఇలుషిన్‌ ఐఎల్‌96-300పియు విమానాల్లో ప్రయాణించారు. రెండు విమానాలు ఏకకాలంలో గాల్లో ఉంటాయి, పుతిన్‌ నిజంగా ఏ విమానంలో ఉన్నారో ఆయన అత్యంత సన్నిహిత భద్రతా బృందానికి తప్ప మరెవరికీ తెలియదు. ఇలా ఒకేలాంటి రెండు విమానాలను ఉపయోగించే ఈ ‘డబుల్‌-డికాయ్‌’ వ్యూహం మాస్కోకు కొత్తేమీ కాదు. గతంలో విదేశీ పర్యటనల సందర్భంగా కూడా పుతిన్‌ ఇదే వ్యూహాన్ని అనుసరించారు.

విమానం ప్రత్యేకత ఏంటంటే?

‘ఫ్లయింగ్‌ క్రెమ్లిన్‌’ లేదా ‘డూమ్స్‌డే ప్లేన్‌’గా పిలిచే ఈ విమానం, 1980వ దశకంలో ఇలుషిన్‌ డిజైన్‌ బ్యూరో అభివృద్ధి చేసిన ఇలుషిన్‌ ఐఎల్‌-96-300పియు మోడల్‌కు ప్రత్యేకంగా మార్పులు చేసిన అత్యంత కస్టమైజ్డ్‌ వెర్షన్‌. అణుయుద్ధం, భారీ విపత్తు, లేదా కీలక సైనిక, ప్రభుత్వ మౌలిక వసతులకు ముప్పు కలిగించే ఏ సంఘర్షణ తలెత్తినా, ఆకాశంలోనే కమాండ్‌ పోస్ట్‌గా పనిచేసేలా రూపొందించిన ఒక ప్రత్యేక కేటగిరీ విమానాల్లో ఇది ఒకటి. ఇలాంటి అత్యంత ప్రత్యేక కేటగిరీ విమానాలను నిర్మించి, నిర్వహిస్తున్నది కేవలం అమెరికా, రష్యా దేశాలు మాత్రమే. నాలుగు అవియాడ్విగటెల్‌ పిఎస్‌-90ఎ టర్బోఫ్యాన్‌ ఇంజిన్ల సాయంతో ఈ విమానం ఇంధనం నింపుకోకుండా దాదాపు 11వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఇది పూర్తిస్థాయి మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌గా పనిచేస్తుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రష్యా సైనిక, గూఢచార, ప్రభుత్వ నెట్‌వర్క్‌లను సురక్షితంగా చేరుకోగల ఎన్‌క్రిప్టెడ్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ దీనికి ఉంది. అదనంగా రాడార్‌-జామింగ్‌ టెక్నాలజీ, అధునాతన రక్షణ వ్యవస్థలు, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా సమాచార మార్పిడికి వీలైన రక్షిత రేడియో, డేటా చానెళ్లు కూడా ఈ విమానంలో ఉన్నాయి. భద్రతా హంగులతో పాటు, సౌకర్యవంతంగా ఉండేలా కూడా ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. పడకగదులు, స్నానపు గదులు, వంటగది, భోజన ప్రాంతాలు, బోర్డురూమ్‌ తరహా సమావేశ మందిరంతో కూడిన ప్రత్యేక అధ్యక్ష సూట్‌ ఇందులో ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్