గాజా యుద్ధ దృశ్యాల చిత్రీకరణకు మరణానంతరం అవార్డు
లండన్: గాజాపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో మరణించిన పాలస్తీనా జర్నలిస్టు మరియం దగ్గాకు ప్రతిష్ఠాత్మక రోరీ పెక్ అవార్డును ప్రకటించారు. ఈ విషయాన్ని రోరీ పెక్ ట్రస్ట్ గురువారం వెల్లడించింది. పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధోన్మాద దాడుల కారణంగా మానవ జీవితాలపై పడిన తీవ్ర ప్రభావాన్ని అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించి.. ప్రపంచానికి కళ్లకు కట్టారని ట్రస్ట్ పేర్కొంది.
గతేడాది ఆగస్టులో దక్షిణ గాజాలోని నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 33 ఏళ్ల మరియం దగ్గా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు పాత్రికేయులు కూడా మృతి చెందారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అసోసియేటెడ్ ప్రెస్‌తో కలిసి స్వతంత్ర ఫోటోగ్రాఫర్‌గా, రిపోర్టర్‌గా మరియం పనిచేశారు. ఈ సందర్భంగా అసోసియేటెడ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జూలీ పేస్ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిజాలను ప్రపంచానికి తెలియజేయడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మరియంను, ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇతర పాత్రికేయులను స్మరించుకుంటున్నామని తెలిపారు.








కామెంట్‌లు (0)