* 10 లక్షల ఉపగ్రహాల ప్రయోగానికి అనుమతి,
* పర్యావరణం అతలాకుతలమవుతుందని శాస్త్రవేత్తల ఆందోళన
వాషింగ్టన్: అంతరిక్షంలో డేటా సెంటర్లను నిర్మించేందుకు గాను పది లక్షల ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని 'స్పేస్ ఎక్స్' (SpaceX) సంస్థకు అమెరికా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృత్రిమ మేధ (AI) రంగంలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో అమెరికాను అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ప్రాజెక్టు ఆచరణ సాధ్యతపైనా, దీనివల్ల కలిగే పర్యావరణ ప్రభావాలపైనా కనీస ఆలోచన చేయకుండా అనుమతులు ఇవ్వడంపై పర్యావరణ శాస్త్రవేత్తలు, అంతరిక్ష నిపుణులు తీవ్ర సందేహాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
'స్టార్‌మైండ్' (StarMind) పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ఉపగ్రహ నెట్‌వర్క్ ద్వారా భూమికి అవసరమైన భారీ స్థాయి డేటాను ప్రాసెస్ చేయడంతో పాటు, సౌరశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చని సంస్థ వివరిస్తోంది. 2033 నాటికి మొదటి విడత ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుండగా, 2040 నాటికి మిగిలిన వాటిని దశలవారీగా మోహరించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ స్వాగతించారు.
పోటీ సంస్థల అభ్యంతరాలు :
ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ స్పేస్ ఎక్స్ పోటీ సంస్థలైన వయాశాట్ (Viasat), అమెజాన్ యాజమాన్యంలోని కైపర్ సిస్టమ్స్ (Kuiper Systems) అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే, అంతరిక్ష వ్యర్థాల నియంత్రణ నిబంధనలకు లోబడే దీనిని అమలు చేస్తున్నామని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామని ఎఫ్‌సీసీ (FCC) తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక ఉపగ్రహ నెట్‌వర్క్‌లో గరిష్టంగా ఎన్ని ఉపగ్రహాలు ఉండాలనే దానిపై ప్రస్తుత అంతర్జాతీయ నిబంధనల్లో ఎలాంటి పరిమితి లేకపోవడాన్ని ఇక్కడ అనుకూలంగా మార్చుకున్నారు.
ప్రస్తుతం కమ్యూనికేషన్ ఉపగ్రహాలు తిరుగుతున్న భూమి దిగువ కక్ష్యలోనే (Low Earth Orbit) ఈ కొత్త ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల ఉపగ్రహాలు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం ఉందని, తద్వారా భారీ ఎత్తున అంతరిక్ష వ్యర్థాలు (Space Debris) పేరుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ఇది దశాబ్దాలుగా సాగుతున్న ఖగోళ పరిశోధనలపై తీవ్ర ప్రభావం చూపుతుందని 'అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ' ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.








కామెంట్‌లు (0)