గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅణుయుద్ధంలో విజేతలుండరు

1 గంట క్రితం

అణ్వాయుధ రహిత *ప్రపంచమే లక్ష్యం: జిన్‌పింగ్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:49 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • అమెరికా, చైనా, రష్యా ఉమ్మడి ప్రకటన

  • ఐక్యరాజ్యసమితిని సంస్కరించేందుకు అంగీకారం

  • అణ్వాయుధ రహిత ప్రపంచమే లక్ష్యం: జిన్‌పింగ్‌

  • విభేదాలున్నా చర్చలు కొనసాగాలి: ట్రంప్

  • ముగిసిన దేశాధినేతల త్రైపాక్షిక సదస్సు

షెన్‌జెన్ : చైనాలోని షెన్‌జెన్ నగరంలో గురువారం జరిగిన తొలి త్రైపాక్షిక సమావేశం అనంతరం, అమెరికా, చైనా, రష్యా దేశాధినేతలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. అణు యుద్ధమంటూ జరిగితే విజేతలేవ్వరూ ఉండరని, అది ఎన్నటికీ చేయకూడదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశం నాలుగు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఒకటి ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, రెండు చమురు సరఫరా, మూడు అణ్వాయుధాల నియంత్రణ. అణు ప్రమాదాల తగ్గింపు, అణ్వాయుధ నియంత్రణలను మూడు దేశాలు చర్చించాలని నిర్ణయించడం గమనార్హం. అలాగే, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో ఐక్యరాజ్యసమితిని మరింత సమర్థవంతంగా మార్చేందుకు, సంస్కరణల కోసం కృషి చేయాలని అవి అంగీకరించాయి. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న ఈ మూడు దేశాలు శాంతి భద్రతల పరిరక్షణకు ఉమ్మడిగా కృషి చేయాలని స్పష్టం చేశాయి. అలాగే, పరస్పర ప్రయోజనాలకోసం శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల తయారీని, సరఫరాను పెంచి ఇంధన రవాణాకు ఆటంకాల్లేకుండా చేయాలని వారు తెలిపారు. అంతేకాకుండా దేశాల మధ్య న్యాయసూత్రాలను గౌరవించాలని, వాటికి అనుగుణంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) వంటి సంస్థలను దుర్వినియోగం చేయొద్దని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై లోతుగా చర్చించిన ముగ్గురు నేతలు, వ్యూహాత్మక స్థిరత్వాన్ని, అంతర్జాతీయ భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ చారిత్రక త్రైపాక్షిక సదస్సుకు ఆతిథ్యమిచ్చినందుకు రష్యా, అమెరికా నేతలు చైనాకు కృతజ్ఞతలు తెలిపారు.

​మెరుగైన ప్రపంచాన్ని నిర్మిద్దాం: జిన్‌పింగ్

సదస్సులో కుదిరిన ప్రధాన ఏకాభిప్రాయాలను వివరించిన షీ జిన్‌పింగ్, చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా, ఫలప్రదంగా సాగాయని తెలిపారు. మెరుగైన ప్రపంచ నిర్మాణం కోసం కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, ప్రపంచశాంతిని కాపాడుకోవడానికి ఉమ్మడి ఏకాభిప్రాయం ఉందని జిన్‌పింగ్ వెల్లడించారు. శాంతికి విఘాతం కల్పించే భద్రతా లోపాలను అగ్ర దేశాలు తీవ్రంగా ఎదుర్కోవాలన్నారు. విభేదాల పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులే సరైన మార్గమని, దీన్ని అందరూ అంగీకరించారని జిన్‌పింగ్ తెలిపారు. ‘‘సంప్రదింపులు ఆగనంత వరకు, తలుపులు మూసుకుపోనంత వరకు శాంతిపై ఆశ ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సవాళ్లను అధిగమించేందుకు పరస్పర సహకారం తప్పనిసరని, ఈ సదస్సులో కుదిరిన ఏకాభిప్రాయాలను అమలు చేయాలని జిన్‌పింగ్‌ కోరారు. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ఇరువురికీ లాభదాయకమైన సహకారం, చర్చలు సంప్రదింపులను అగ్ర దేశాలు పాటించాలన్నారు. దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను, సామాజిక వ్యవస్థలను, అభివృద్ధి మార్గాలను, కీలక ప్రయోజనాలను పరస్పరం గౌరవించుకోవాలన్నారు.

​అంతర్గత వ్యావహారాల్లో జోక్యం వద్దు...

ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. సున్నితమైన అంశాల్లో ముందుగానే సమాచారం పంచుకోవాలి, ఒకరి దృక్కోణాన్ని మరొకరు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఒకరి ‘‘రెడ్ లైన్లను’’ మరొకరు సవాలు చేయకూడదన్నారు. మూడు దేశాలు భాగస్వాములు, మిత్రులుగా ఉండాలని, ఘర్షణ లేదా ఎదురుదాడి మార్గం ఎంచుకోకుండా శాంతియుత సహజీవనానికి కట్టుబడి (థ్యూసిడిడీస్ ట్రాప్) ఉండాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రధాన విజేతలైన ఈ మూడు దేశాలు అంతర్జాతీయ క్రమాన్ని (వరల్డ్‌ ఆర్డర్‌) దృఢంగా కాపాడాలన్నారు. మానవాళి నెత్తిన వేలాడుతున్న ‘‘డెమోక్లీస్ ఖడ్గం’’ వంటి అణ్వాయుధాలను పూర్తిగా నిషేధించి, క్రమంగా పూర్తిగా నాశనం చేసి, అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. వనరులు, తయారీ, వినియోగంలో మూడు దేశాలు ఆర్థిక వాణిజ్య సహకారాన్ని పెంచుకోవాలని, పారిశ్రామిక, సరఫరా గొలుసులను దెబ్బతీయడం (డీకప్లింగ్) సరైన మార్గం కాదని జిన్‌‌పింగ్‌ అన్నారు.

​విభేదాలున్నా చర్చలు కొనసాగించాలి: ట్రంప్

మూడు దేశాల ప్రజలనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అంశాలపై బహిరంగంగా, గౌరవప్రదంగా మాట్లాడాల్సిన బాధ్యత తమపై ఉందని ట్రంప్‌ అన్నారు. గతంలో విభేదాలున్న దేశాలతో చర్చలకు నాయకులు తరచూ దూరంగా ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యర్థులతో మాట్లాడేందుకు నిరాకరించడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాలేదని, పరిష్కారానికి ప్రత్యక్ష చర్చలు అవసరమని చెప్పారు. ఈ సమావేశం ద్వారా విదేశాంగ విధానంలో తాను భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్నానని ట్రంప్ వ్కాఖ్యానించడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో తొలిసారిగా సంయుక్తంగా సమావేశమవడం దౌత్యపరమైన కీలకమై మార్పు అని అన్నారు. సమావేశంలో అణ్వాయుధాల నిరాయుధీకరణపై చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాలు వాటిని వదులుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వ్యాప్తి ముప్పును ఎదుర్కోవడానికి మూడు దేశాల సహకారం కీలకమని, ఇరాన్‌ అణ్వాయుధాలను పొందకుండా చూడాలని అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై పుతిన్‌తో ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇక చైనాతో గూఢచర్యం అంశంపై మాట్లాడుతూ, అమెరికా చైనాపై గూఢచర్యం చేస్తుందని, చైనా కూడా అమెరికాపై గూఢచర్యం చేస్తుందని ట్రంప్ అన్నారు. “మనం వాళ్లకంటే మెరుగ్గా గూఢచర్యం చేస్తాం” అని వ్యాఖ్యానించారు.

మూడు దేశాల మధ్య సహకారం అవసరం : పుతిన్‌

ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ, ఆర్థిక సంబంధాలు, ఆహార, ఇంధన భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో మూడు దేశాల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటు ప్రాంతీయ వివాదాల పరిష్కారంలోనూ ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. మాస్కో, బీజింగ్‌, వాషింగ్టన్‌ మధ్య పరస్పర గౌరవం, సమాన ప్రయోజనాలతో కూడిన సహకారం ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం, సరిహద్దులు దాటే వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడంలోనూ మూడు దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్