వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తికి అమెరికా కోర్టు 27 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. ఇరాన్ ఆదేశాల మేరకు అమెరికా రాజకీయ నాయకులను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు తేలడంతో ఈ తీర్పు వెలువడింది. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌కు చెందిన 48 ఏళ్ల ఆసిఫ్ మర్చంట్ 2024లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖ రాజకీయ నాయకులను హత్య చేసేందుకు వ్యక్తులను నియమించుకోవాలని ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్ర వెనుక ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) ఉన్నట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ మరణానికి ప్రతీకారంగా ఈ కుట్రకు ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ట్రంప్‌తో పాటు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నిక్కీ హేలీల పేర్లు కూడా లక్ష్యాల జాబితాలో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కుట్రలో భాగంగా ఆసిఫ్ మర్చంట్ కొంతమందిని సంప్రదించగా, వారు ఎఫ్‌బీఐ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు రహస్య ఆపరేషన్ చేపట్టి, హంతకులుగా నటించిన అండర్‌కవర్ ఏజెంట్లను అతడికి పరిచయం చేశారు. వారికి ముందస్తుగా 5,000 డాలర్లు చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. దాడి జరగకముందే అధికారులు కుట్రను భగ్నం చేశారు. అయితే తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే భయంతోనే ఇరాన్‌కు చెందిన వ్యక్తుల మాట విన్నానని, నిజంగా హత్య చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఆసిఫ్ మర్చంట్ కోర్టులో వాదించాడు. అయినప్పటికీ న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించింది. బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఎరిక్ కొమిటీ అతడికి మొత్తం 330 నెలలు, అంటే 27 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించారు. హత్యకు డబ్బు చెల్లించి కుట్ర పన్నడం, అంతర్జాతీయ ఉగ్రవాద చర్యకు ప్రయత్నించడం వంటి అభియోగాలపై ఈ శిక్ష విధించారు.








కామెంట్‌లు (0)