ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుద్ధానికి ముగింపు పలకాలి.. జెలెన్‌స్కీపై ట్రంప్‌ ఒత్తిడి

4 రోజుల క్రితం

Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 04:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్ష‍ుడు ట్రంప్ ఉక్రెయిన్‌ అధ్యక్ష‍ుడు జెలెన్‌స్కీపై ఒత్తిడిని తీవ్రతరం చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి జెలెన్‌స్కీ అంగీకరించాలని తాను కోరుకుంటున్నానని, లేకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. జెలెన్‌స్కీ ఈ యుద్ధాన్ని ముగించాలని కోరుకోవాలని అన్నారు. ఒకవేళ ఆయన అలా కోరుకోకపోతే, అది తీవ్రమైన ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని ట్రంప్‌ ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌ నేత, వైట్‌హౌస్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌కు మధ్య ఓస్లోలో జరిగిన సమావేశం గురించి అడిగిన ప్రశ్నలకు ట్రంప్‌ మంగళవారం ఈ సమాధానాలిచ్చారు. ఇరు దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదరాలని కోరుకుంటున్నట్లు ట్రంప్‌ తెలిపారు. జెలెన్‌స్కీ, పుతిన్‌ల మధ్య ఉన్న "తీవ్రమైన ద్వేషమే" వారు యుద్ధాన్ని ముగించే శాంతి ఒప్పందానికి రాలేకపోవడానికి ప్రధాన కారణమని అన్నారు. జెలెన్‌స్కీ ఒప్పందానికి అంగీకరించాల్సిందేనని అన్నారు. ఇప్పటికే అమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్ కోసం భారీగా ఖర్చు చేశాయని అన్నారు . ఐరోపాకు విసుగువచ్చిందని, ఒకవేళ వారు ఒప్పందానికి రాకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కి అమెరికా వందల బిలియన్‌ డాలర్ల విలువైన సాయం ఆయుధాలు అందించిందని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ఫలితంగా తమకు దక్కింది ఏమీలేదని, పైగా డీజిల్‌ కోసం భారీ ధర చెల్లించాల్సి వస్తోందని అన్నారు. రష్యాలోని ఇంధన కేంద్రాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల వల్ల ఇంధన ధరలు పెరిగాయని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న యుద్ధం కారణంగా గత కొన్ని నెలలుగా ఈ ధరలు మరింత తీవ్రంగా పెరిగాయని చెప్పారు.


రష్యాతో ఇంధన కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసి, మాస్కోపై ఆంక్షలను సడలించిన అనంతరం ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల సరఫరాలో జాప్యాన్ని జెలెన్‌స్కీ ఖండించిన సంగతి తెలిసిందే. అమెరికా నిఘా సమాచార పంపిణీలో అంతరాయాలు, స్టార్‌షీల్డ్‌కు అనుసంధానంపై ఆంక్షల గురించి జెలెన్‌స్కీ ఫిర్యాదులు చేసింది. ఉక్రెయిన్‌ను రష్యాకు లొంగిపోయేలా బలవంతం చేయాలనేది ట్రంప్ ఉద్దేశ్యమేనని, వీటన్నింటికీ అదే కారణమని జెలెన్స్కీ ఆరోపించారు. దీంతో ఉక్రెయిన్‌కు, అమెరికాకు మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈవ్యాఖ్యలు వెలువడ్డాయి.

మరోవైపు, శాంతి ఒప్పందంపై చర్చలను పునఃప్రారంభించాలన్న జెలెన్‌స్కీ ప్రతిపాదనను పుతిన్‌కు తెలిపేందుకు విట్కాఫ్ బుధవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్లనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్