కెనడాతో వాణిజ్య యుద్ధం
అంటారియో లేక్ పేరు మార్పుపై తీవ్ర వ్యతిరేకత
వాషింగ్టన్ : అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు రిపబ్లికన్ పార్టీని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. కెనడాతో వాణిజ్య పోరు, అంటారియో సరస్సు పేరు మార్పు వంటి చర్యలపై అమెరికా ప్రజలు మండిపడుతున్నారు. గతంలో వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలతో ట్రంప్ ప్రజాదరణ కోల్పోగా తాజా నిర్ణయాలతో ఆయన రేటింగ్ మరింతగా దిగజారింది. రాయిటర్స్‘ఇప్సోస్ పోల్ ప్రకారం... లేక్ అంటారియో పేరును లేక్ అమెరికాగా మార్చాలన్న నిర్ణయాన్ని 63 శాతం మంది వ్యతిరేకించారు. కేవలం 14 శాతం మంది మాత్రమే సమర్ధించారు. గత సంవత్సరం గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చినప్పుడు వ్యక్తమైన వ్యతిరేకతతో పోలిస్తే ఇది మరింత ఎక్కువగా ఉంది. ట్రంప్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 52 శాతం ఉండగా బలంగా సమర్ధిస్తున్న వారు కేవలం ఏడు శాతం మంది మాత్రమే.
సరస్సు పేరును మార్చడమెందుకు ?
అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా అంటారియో పేరు మార్పును జీర్ణించుకోవడం లేదు. రిపబ్లికన్లలో 43 శాతం మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా 33 శాతం మంది సమర్ధించారు. కెనడాతో నెలకొన్న వాణిజ్య వివాదం కారణంగా ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో సరస్సు పేరును మార్చాలని ట్రంప్ నిర్ణయించారు. కెనడాపై ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలను 57 శాతం మంది వ్యతిరేకిస్తుంటే 20 శాతం మంది బలపరిచారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రతీకార సుంకాలు, వలస విధానాల కారణంగా ట్రంప్ ఇప్పటికే అనేక సర్వేలలో బాగా వెనుకబడిపోయారు. తాజాగా వాణిజ్య ఉద్రిక్తతలకు కెనడాయే కారణమని ట్రంప్ నిందించినప్పటికీ అమెరికాయే ఎక్కువగా బాధ్యత వహించాలని 46 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. కెనడాపై విధించిన సుంకాలను కేవలం తొమ్మిది శాతం మందే సమర్ధిస్తుండగా 43 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు.
కఠిన వైఖరి తగదు
కెనడాపై విధించిన సుంకాలు తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితికి నష్టాన్నే కలిగిస్తాయని 40 శాతం మంది అంటుంటే లాభపడతామని చెప్పింది కేవలం నాలుగు శాతం మందే. కెనడాతో జరిగిన వాణిజ్య చర్చలలో ఆశించిన ఫలితాలు రాకపోయినా కఠిన వైఖరి తీసుకోవడం మంచిది కాదని 68 శాతం మంది చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే కెనడాతో ఘర్షణను అమెరికన్లు కోరుకోవడం లేదు. రిపబ్లికన్లలో సగం మంది కూడా సర్దుబాటు వైఖరికే మద్దతు ఇస్తున్నారు. కెనడా సరిహద్దు రాష్ట్రాలైన అలాస్కా, మైనే, మిచిగాన్, ఒహాయోలలో మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లకు ఎదురు దెబ్బలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.








కామెంట్‌లు (0)