సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కమ్యూనిస్టులపై ట్రంప్ అక్కసు

1 గంట క్రితం

trump.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 07:46 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఘనంగా 250వ స్వాతంత్య్ర వేడుకలు

  • మధ్యంతర ఎన్నికలే లక్ష్యంగా దుష్ప్రచారం

వాషింగ్టన్ : అమెరికా 250వ వ్యవస్థాపక వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ట్రంప్ కమ్యూనిస్టులపై అక్కసు వెళ్లగక్కారు. 'కమ్యూనిస్టు' ముప్పు నుంచి దేశాన్ని కాపాడాలంటూ కస్సుబుస్సులాడారు. 'దేశంలోకి కొత్తగా వచ్చిన వారు మన జీవన విధానానికి, మన విజయాలకు వ్యతిరేకమైన భావజాలాన్ని స్వీకరిస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు కమ్యూనిస్టు ముప్పు మరోసారి విజృంభిస్తోంది. దీనిని మేము సాగనివ్వం' అని చెప్పుకొచ్చారు. 'అమెరికా సంయుక్త రాష్ట్రాల పౌరులమైన మేము త్వరలోనే కమ్యూనిస్టులను ఓడిస్తామని అందరూ వినేలా ప్రమాణం చేస్తున్నాము. మేము వారిని త్వరలోనే తరిమేస్తాం. దేశాన్ని మునుపెన్నడూ లేనంత బలంగా నిర్మిస్తాం. అమెరికా ఎన్నటికీ కమ్యూనిస్టు దేశం కాబోదు. కమ్యూనిజం క్యాన్సర్ వంటిది. దానిని కోసి పారేయాలి. అది కూడా చాలా వేగంగా...' అని రెచ్చిపోయారు. నవంబరులో అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు కాంగ్రెస్పై పట్టు కోల్పోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వామపక్ష డెమొక్రాట్ అభ్యర్థులు ఇటీవల వరుస విజయాలు సాధిస్తున్నారు. న్యూయార్క్, కొలరాడోలలో జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీల పోరులో ముగ్గురు డెమొక్రటిక్ సోషలిస్టులు సహా నలుగురు ప్రగతిశీల అభ్యర్థులు ఎన్నికయ్యారు. కెంటకీ, న్యూజెర్సీ, ఓహియో, పెన్సిల్వేనియా, టెక్సాస్లో కూడా ప్రగతిశీల అభ్యర్థులదే పైచేయి అయింది. ఈ విజయాలపై ట్రంప్ వ్యాఖ్యానిస్తూ 'దేశం ఏర్పడినప్పటి నుంచి ఎదురైన అతి పెద్ద ముప్పు ఇదే' అని చెప్పారు.

ఆశయాలకు దూరంగా...

2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను రద్దు చేసేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు మొదలుకొని ఇప్పుడు ఓటింగ్ హక్కులు, ప్రాతినిధ్యంపై ఆయన చేస్తున్న నిరంతర దాడుల వరకూ జరిగిన పరిణామాలను గమనిస్తే స్వేచ్ఛాయుత ఎన్నికలు, మెజారిటీ పాలన, ప్రజాస్వామ్యం... ఇవే ఆయన లక్ష్యాలని అర్థమవుతుంది. కాంగ్రెస్ లోని ఆఫ్రికన్ - అమెరికన్ సభ్యులలో మూడింట ఒక వంతు మందిని తొలగించాలన్నది ట్రంప్ ఉద్దేశంగా I తెలుస్తోంది. ఓటింగ్ హక్కుల చట్టంలోని రక్షణలను సుప్రీంకోర్టు ఇప్పటికే తొలగించింది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని కష్టతరం చేస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలలో ఓటర్లను భయపెట్టడానికి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసిఇ)ను రంగంలోకి దింపుతామని ట్రంప్ మద్దతుదారులు బెదిరిస్తున్నారు. రెండున్నర శతాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ ఉంది, ఎటు వెళుతోంది అనే విషయాలపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్ర ప్రకటనలో పొందుపరచిన ఆశయాలకు అనుగుణంగా అమెరికా ముందుకు సాగడం లేదని క్వినిపియాక్ యూనివర్సిటీ నిర్వహించిన పోల్లో ఏకంగా 61 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ప్రచార తరహాలో...

ట్రంప్ ప్రసంగం ఎన్నికల ప్రచారం మాదిరిగా సాగింది. దేశంలో కమ్యూనిస్టులు పట్టు సాధించవచ్చునని హెచ్చరించారు. స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఎదురవుతున్న సైద్ధాంతిక ముప్పును ప్రస్తావించారు. మెయిన్ బ్యాలెట్ను పరిమితం చేసే, ఓటు నమోదు కోసం పౌరసత్వ రుజువును తప్పనిసరి చేసే చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్ ను కోరారు. అమెరికా గుర్తింపుపై దాడి జరుగుతోందన్నారు. ట్రంప్ ముందు పనిచేసిన అమెరికా అధ్యక్షులు జూలై 4 వేడుకలకు వ్యక్తిగతంగా హాజరైన ఉదంతాలు లేవు. ట్రంప్ మాత్రం అధికారిక కార్యక్రమానికి, ప్రచార తరహా రాజకీయాలకు మధ్య ఉన్న గీతను చెరిపేశారు. 2019లో కూడా ట్రంప్ ఇలాంటి ప్రసంగమే చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు 1950 నాటి కమ్యూనిస్టుల వేట రోజులను గుర్తుకు తెస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్