శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చమురు లీకేజీ.. ఉమ్ అల్ క్వైన్‌లో బీచ్‌లు మూసివేత

30 నిమిషాల క్రితం

UAE closes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 12:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అబుదాబి : ట్యాంకర్‌ నుంచి చమురు లీకేజీ కారణంగా సముద్ర జలాలు కాలుష్యానికి గురైనట్లు గుర్తించడంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)లోని ఉమ్‌ అల్‌ క్వైన్‌లో అన్ని బీచ్‌లు, తీర ప్రాంతాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌ పోస్ట్‌లో శుక్రవారం వెల్లడించింది. యుఎఇ సాంకేతిక పర్యవేక్షణ, పర్యావరణ అంచనా వ్యవస్థ ద్వారా చమురు లీకేజీని గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వెంటనే స్థానిక, సమాఖ్య సంస్థల సమన్వయంతో కాలుష్యాన్ని అరికట్టేందుకు, ప్రభావిత ప్రాంతాలను శుభ్రపరిచి పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించినట్లు పేర్కొంది. షార్జా, అజ్మాన్‌, ఉమ్‌ అల్‌ క్వైన్‌ ప్రాంతాల్లో చమురు లీకేజీకి సంబంధించిన దుర్వాసనలు గుర్తించినట్లు వెల్లడించింది. అయితే, ఈ వాసనల వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఉమ్‌ అల్‌ క్వైన్‌లోని బీచ్‌లు, తీర ప్రాంతాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక బృందాలు పర్యావరణ పరిస్థితులను అంచనా వేసి, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలను గుర్తించే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చమురు లీకేజీ వల్ల సముద్ర పర్యావరణానికి కలిగిన నష్టాన్ని పరిమితం చేసేందుకు శుభ్రపరిచే, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కాలుష్యం విస్తరించిన పరిధిని గుర్తించేందుకు, సముద్ర జీవావరణ వ్యవస్థపై దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు తీర ప్రాంతాల్లో సర్వేలు, పర్యవేక్షణ కొనసాగుతున్నాయి. పరిస్థితిని అనుసరించి అదనపు చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో చేపలు పట్టవద్దని మత్స్యకారులు, ఇతర సముద్ర వినియోగదారులకు సూచించింది. అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని కోరింది. అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవాలని, పుకార్లను వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్