- లఫాయెట్ స్క్వేర్ వద్ద కారు బీభత్సం
- శ్వేతసౌధాన్ని తాత్కాలిక లాక్‌డౌన్ చేసిన అధికారులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భవనానికి ఉత్తరం వైపున ఉన్న లఫాయెట్ స్క్వేర్ వద్ద ఒక కారు దూసుకొచ్చి స్తంభాన్ని ఢీకొట్టింది. దాదాపు అదే సమయంలో మరో వ్యక్తి లఫాయెట్ పార్క్ వద్ద బారికేడ్ దాటేందుకు ప్రయత్నించాడు. ఇద్దరినీ అమెరికా సీక్రెట్ సర్వీస్ అదుపులోకి తీసుకుంది. ముందస్తు చర్యగా వైట్ హౌస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు.
సోమవారం ఉదయం వైట్ హౌస్‌కు ఒక బ్లాక్ దూరంలో ఉన్న లఫాయెట్ స్క్వేర్ ఉత్తర చివర (16వ వీధి, హెచ్ స్ట్రీట్ ప్రాంతం) ఈ ఘటన జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కి భద్రతా సైన్‌పోస్ట్‌ను ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు పరుగులుతీశారు. సంఘటనా స్థలంలో ఉన్న నేషనల్ గార్డ్ సిబ్బంది కూడా స్పందించారు. కారు నుంచి దిగిన డ్రైవర్ భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగాడని, దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత కొనసాగిందని ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
అదే సమయంలో లఫాయెట్ పార్క్ నుండి ఒక వ్యక్తి బారికేడ్‌ను దాటి లోపలికి దూకాడు. అతడినీ సీక్రెట్ సర్వీస్ వెంటనే అరెస్ట్ చేసింది. ఈ ఘటన తర్వాత వైట్ హౌస్‌లో భద్రతా లాక్‌డౌన్ ప్రకటించింది. వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోని విలేకరులను భవనం లోపలే ఉండాలని అధికారులు తెలిపారు. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనంలోనే ఉన్నట్లు సమాచారం. కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దించాయి. తనిఖీల అనంతరం ప్రమాదం లేదని నిర్ధారించుకున్న అనంతరం లాక్‌డౌన్ ఎత్తివేశారని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు కొనసాగుతోంది. కారు ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.








కామెంట్‌లు (0)