మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రంప్ బ్లాక్‌లిస్ట్ అస్త్రం: ఆసియాలోని 7 టెక్ దిగ్గజాలకు అమెరికా షాక్!

1 గంట క్రితం

ట్రంప్ బ్లాక్‌లిస్ట్ అస్త్రం: ఆసియాలోని 7 టెక్ దిగ్గజాలకు అమెరికా షాక్!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 01:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వాషింగ్టన్: చైనా సాంకేతిక వృద్ధిని కట్టడి చేసేందుకు ఆసియా దేశాలకు చెందిన ఏడు ప్రముఖ కంపెనీలను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు చెందిన సింగపూర్ అనుబంధ సంస్థ 'అపెక్స్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్', సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'మెగాస్పీడ్ ఇంటర్నేషనల్' తదితర కంపెనీలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వాణిజ్య ఆంక్షలు విధించింది.


అమెరికా వాణిజ్య శాఖకు చెందిన 'ఎంటిటీ లిస్ట్'లో చేర్చడం వల్ల, అమెరికాలో తయారైన ఏఐ (AI) చిప్‌లు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయడానికి ఈ కంపెనీలు ఇకపై యూఎస్ ప్రభుత్వ ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా ఎగుమతి నియంత్రణలను ఉల్లంఘించి, ఎన్విడియా (Nvidia) సంస్థకు చెందిన అధునాతన ఏఐ చిప్‌లను చైనాకు అక్రమంగా తరలించడంలో ఈ సంస్థలు సహకరించాయనే ఏకపక్ష ఆరోపణలతో వాషింగ్టన్ ఈ చర్య తీసుకుంది.


బ్లాక్‌లిస్ట్‌లో చేర్చబడిన సంస్థల్లో మలేషియాకు చెందిన MSFusion Sdn. Bhd., PT Megaspeed International, Speedmatrix Sdn. Bhd.; సింగపూర్‌కు చెందిన Apex Enterprise Solutions (Singapore) Private Limited, Megaspeed International Pte. Ltd., Swiftdata Pte. Ltd.; అలాగే థాయ్‌లాండ్‌కు చెందిన Megaspeed (Thailand) Co., Ltd. ఉన్నాయి.


మరోవైపు, అమెరికా ఏకపక్ష ఆంక్షల నిర్ణయాన్ని అలీబాబా తీవ్రంగా ఖండించింది. తమ అనుబంధ సంస్థ అపెక్స్ ఎంటర్‌ప్రైజ్ అమెరికా ఎగుమతి నియంత్రణలు ఉన్న చిప్‌లను ఎక్కడికీ మళ్లించలేదని, బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం పూర్తిగా అన్యాయమని అలీబాబా ప్రతినిధి స్పష్టం చేశారు. కంపెనీ హక్కులు, ప్రతిష్టను కాపాడుకోవడానికి సాధ్యమైన అన్ని న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని అలీబాబా ప్రకటించింది. అమెరికా ఆంక్షలను అధిగమించేందుకు సొంతంగా అభివృద్ధి చేస్తున్న చిప్ సాంకేతికతపై అలీబాబా దృష్టి సారిస్తోంది.


ఇదిలా ఉండగా, మెగాస్పీడ్ కంపెనీపై అమెరికా చర్యల నేపథ్యంలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ వాస్తవాలను వివరిస్తూ స్పందించారు. వివాదాస్పద చిప్‌లను సింగపూర్‌కు ఎగుమతి చేయలేదని, కేవలం ఇతర గమ్యస్థానాలకు రవాణా మాత్రమే చేశారని ఆయన ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా స్పష్టం చేశారు. మెగాస్పీడ్ మాజీ సీఈఓ ఆలిస్ హువాంగ్‌పై సింగపూర్ విచారణ జరిపినప్పటికీ, ప్రాసిక్యూషన్ చర్యలకు అవసరమైన ఎటువంటి ఆధారాలు లభించలేదని ప్రధాని తెలిపారు. స్థానిక చట్టాల ఉల్లంఘన జరిగిందా లేదా అనే అంశంపై మాత్రమే సింగపూర్ విచారణ కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్