- రెడ్క్రాస్ పిలుపు
జెనీవా : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీ (ఐసిఆర్సి) అధ్యక్షులు మీర్జానా స్పార్జరిక్ కోరారు. ఇంకా ఈ ప్రాంతంలో ఘర్షణలు ఇలాగే కొనసాగితే లక్షలాదిమంది పౌరులకు తీవ్ర వినాశనమే మిగులుతుందని హెచ్చరించారు. ‘ పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక ఆపరేషన్ల ఫలితంగా ప్రజలు ఆమోదయోగ్యం కాని రీతిలో మూల్యం చెల్లిస్తున్నారు’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలి రోజుల్లో సౌదీ అరేబియాలో చోటు చేసుకుంటున్న మరణాలు, గాయాలు, విధ్వంసకాండ చూస్తుంటే ఈ ఘర్షణలు, శత్రు చర్యలు పౌరులపై చూపుతున్న ప్రభావానికి మరో ఉదాహరణగా నిలిచాయన్నారు.
ఆడెన్, సానాలతో సహా మొత్తంగా యెమెన్లో, మరణాలు, నిర్వాసితులు, పౌర సదుపాయాలకు కలిగిన నష్టం స్థాయి చూస్తుంటే ఆందోళనకరంగా అనిపిస్తోంది. మొత్తంగా మధ్య ప్రాచ్యం వ్యాప్తంగా పౌర సదుపాయాలపై పదే పదే దాడులు కొనసాగుతున్నాయని, సామాన్యుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడుల నుండి పౌరులు, పౌర సదుపాయాలకు మినహాయింపులు వుండాలన్నారు. ఘర్షణ పడే పక్షాలు కచ్చితంగా పౌరులు, పౌర లక్ష్యాలకు, మిలటరీ లక్ష్యాలకు తేడా చూసుకోవాలన్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇతర కీలక సదుపాయాలపై దాడులు జరపడం వల్ల వాటిపై ఆధారపడే వారు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటారని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే లక్షలాదిమంది ప్రజలు తీవ్ర విపత్తులను ఎదుర్కొనే అవకాశం వుందని హెచ్చరిస్తూ తక్షణమే ఉద్రిక్తతల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.







కామెంట్లు (0)