టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా ఘటన
ప్రయాణికులకు తప్పిన ప్రమాదం.. ఎఫ్‌ఏఏ దర్యాప్తు
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఉన్న రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు బోయింగ్ 737 విమానాల రెక్కలు ఢీకొన్నాయి.
డల్లాస్ వెళ్లాల్సిన ఫ్లైట్ 638, చికాగో వెళ్లాల్సిన ఫ్లైట్ 2152 రన్‌వే వద్ద టేకాఫ్ కోసం వేచి ఉన్నాయి. ఈ క్రమంలో ట్యాక్సీయింగ్ సమయంలో రెండు విమానాల రెక్కల చివరలు ఒకదానికొకటి తగిలాయి. దీంతో ఓ విమానం రెక్కకు చెందిన వింగ్‌లెట్ భాగం విరిగి నేలపై పడింది. వెంటనే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.
అప్రమత్తమైన అధికారులు రెండు విమానాలను గేట్ల వద్దకు వెనక్కి పంపించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం మరమ్మతుల కోసం విమానాలను సర్వీసు నుంచి తొలగించినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ప్రయాణికులను ఇతర విమానాల్లో వారి గమ్యస్థానాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది.
థ్యాంక్స్‌గివింగ్ పండుగ రద్దీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) దర్యాప్తు చేపట్టింది.








కామెంట్‌లు (0)