-84సార్లు ఉల్లంఘించారు
- లెబనాన్‌లో కాల్పులపై ఇరాన్
వాషింగ్టన్ : ఇరాన్‌తో కుదుర్చుకున్న, శుక్రవారం సంతకాలు చేయనున్న అవగాహనా ఒప్పందం ఫైనల్ (తుది ఒప్పందం) కాదని, ఒకవేళ ఇది పనిచేస్తున్న తీరు తనకు నచ్చకపోతే మళ్లీ ఇరాన్‌పై బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. జి-7 దేశాల సదస్సు కోసం ప్రస్తుతం ఫ్రాన్స్‌లో వున్న ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ శిశితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మార్కెట్లు చాలా సంతోషంగా వున్నాయని, ఇరాన్‌లో తాము పెట్టుబడులు పెట్టబోమని, గల్ప్ దేశాలు కూడా పెట్టకూడదని కోరినట్లు చెప్పారు. ఏదో ఒక దశలో ఆ దేశాలు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఓకేనని అన్నారు. 2015లో ఇరాన్‌ను అణు ఒప్పందానికి ఒప్పించేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ దేశానికి లంచమిచ్చారని ట్రంప్ ఆరోపించారు. తాను అలా ప్రయత్నించనన్నారు. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధం వుండేందుకు అస్సలే మాత్రం అవకాశాలు లేవన్నారు. ఇజ్రాయిల్ 84 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్‌లో 84సార్లు ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఇరాన్ విమర్శించింది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే తీవ్రంగా స్పందించక తప్పదని హెచ్చరించింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ బలగాలు జరిపిన దాడుల్లో నలుగురు మరణించిన నేపథ్యంలో ఇరాన్ ఈ హెచ్చరికలు చేసింది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రంప్ స్పష్టం చేశారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ పూర్తిగా దాడులను నిలిపివేయలేదు కానీ దాడుల వేగం తగ్గిందని క్షేత్రస్థాయిలోని మీడియా వర్గాలు తెలిపాయి. టైర్ ఏరియాలో అనేక చోట్ల డ్రోన్లతో దాడులు జరిగాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. లెబనాన్‌లో దాడులకు పాల్పడినప్పుడల్లా పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ నుండి తరలిపోవాలంటూ ఇజ్రాయిల్ సైన్యం ఆదేశాలు జారీ చేయడం యుద్ధ నేరాల కిందకే వస్తుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.









కామెంట్‌లు (0)