mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌కు అమెరికా షాక్..

1 రోజు క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 01:23 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పాక్‌లో పిఒకె భాగమేనంటూ వక్రీకరణ

న్యూఢిల్లీ, వాషింగ్టన్‌ : ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని ఒకప్పుడు చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు గట్టి షాకిచ్చింది. ఈ ప్రాంతంలో పనిచేసే యుఎస్ సైనిక కమాండ్‌ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తీసేసింది. అంతేకాదు.. భారత చిత్రపటాన్ని కూడా మార్చి చూపించడం వివాదాస్పదమైంది. జి-7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ , భారత ప్రధాని మోడీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగిన సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా యుద్ధ శాఖ యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ (యూఎస్‌ఇండోపకామ్‌) పేరును యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ (యూఎస్‌పకామ్‌)గా మార్చింది. అంటే యూఎస్‌ఇండోపకామ్‌లో 'ఇండో' అనే పదాన్ని తొలగించింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తన నిర్వహణలో ఉన్న భూభాగానికి సంబంధించి సైనిక కమాండ్‌ తన అధికారిక వెబ్‌సైటులో భారతదేశానికి చెందిన చిత్రపటాన్ని తప్పుగా ప్రదర్శించింది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పిఒకె)ను పాకిస్తాన్‌లో భాగంగా చూపింది. 2018లో అమెరికా రక్షణ మంత్రిగా ఉన్న జిమ్‌ మాటిస్‌ హిందూ మహాసముద్ర ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను, పసిఫిక్‌ భద్రతతో దాని అనుబంధాన్ని ప్రతిబింబించేలా సైనిక కమాండ్‌కు యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ అని పేరు పెట్టారు. అమెరికాకు చెందిన చారిత్రక ‘యూఎస్‌ ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ ’ పేరును మళ్లీ ‘యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చినట్టు అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. ‘‘చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్‌లో సేవలందించే సైనికుల్లో స్ఫూర్తి పెంపొందించడం కోసం ఈ కమాండ్‌కు పాత పేరునే కొనసాగించాలని నిర్ణయించాం’’ అని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. ఇక, ఈ కమాండ్‌ ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుపుతూ తమ వెబ్‌సైట్‌లో ఓ ఫొటోను ఉంచింది. అందులో ‘పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌’ను పాకిస్తా న్‌ భూభాగంగా చూపించడం వివాదానికి దారితీసింది. యుద్ధ శాఖ ప్రకటన ప్రకారం...యూఎస్‌పకామ్‌ ప్రాంతం అమెరికా పశ్చిమ తీర జలాల నుంచి భారత పశ్చిమ సరిహద్దు వరకూ విస్తరించి ఉంది. చరిత్రలో ఉన్నదేంటి? యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ను 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్‌. ట్రుమ్యాన్‌ ఏర్పాటుచేశారు. అమెరికా వెస్ట్‌ కోస్ట్‌ నుంచి భారత పశ్చిమతీరం వరకు గత ఏడు దశాబ్దాలకు పైగా ఈ కమాండ్‌ సేవలందిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రాంతీయ స్థిరత్వంలో ఈ దళం కీలక పాత్ర పోషించింది. కొరియన్‌, వియత్నాం యుద్ధాల్లోనూ పనిచేసింది. ఎన్నో మానవతా ఆపరేషన్లను చేపట్టింది. ట్రంప్‌ తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో 2018లో దీని పేరును ‘యూఎస్‌ ఇండో - పసిఫిక్‌ కమాండ్‌’గా మార్చారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహా సముద్రాల మధ్య పెరుగుతున్న అనుసంధానతను గుర్తించి దీని పేరులో ‘ఇండో’ అనే పదం చేర్చినట్లు నాటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ వెల్లడించారు. ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా ఇప్పుడు యూటర్న్‌ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల్లో భారత్‌ను అగ్రరాజ్యం దూరం పెడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్