- టెహ్రాన్ చేరుకున్న అయతొల్లా ఖమేనీ భౌతిక కాయం
- 6న అంతిమ యాత్ర.. 9న ఖననం
- భారతీయ మత పెద్దల నివాళి
టెహ్రాన్ : అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి అంతిమ వీడ్కోలు పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన భౌతికకాయం టెహ్రాన్‌కు చేరుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఖమేనీ మరణించిన ప్రదేశానికి సమీపంలో ప్రసిద్ధ ‘ఇమామ్ ఖొమేనీ హుస్సేనియా’ వేదికగా ఈ అంత్యక్రియల క్రతువు జరగనుంది. ఇరాన్ సంప్రదాయాల ప్రకారం దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. శని, ఆదివారాల్లో టెహ్రాన్‌లో రెండు రోజుల పాటు ప్రజల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు. 6న అంతిమ యాత్ర నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మషాద్‌లో ఈనెల 9న ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు రెండు కోట్ల మంది వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో టెహ్రాన్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి ఇరాన్ ప్రభుత్వ, సైనిక ఉన్నతాధికారులు భారీగా హాజరవుతున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండ్ ఇన్ చీఫ్ అహ్మద్ వాహిదితో పాటు పలువురు కీలక దౌత్యవేత్తలు, సైనిక ప్రముఖులు ఖమేనీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఖమేనీ అంత్యక్రియలకు ఆయన కుమారుడు, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హాజరయ్యే ప్రత్యక్షంగా హాజరు కాకపోవచ్చని ఇరాన్ వర్గాలు తెలిపాయి. అయతుల్లా ఖమేనీకి భారత్ నుంచి వచ్చిన మత పెద్దల బృందం నివాళి అర్పించింది. ఈ చిత్రం ఇరాన్ రాయబార కార్యాలయం పంచుకున్న దృశ్యాలలో కనిపించింది.








కామెంట్‌లు (0)