- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ సిద్ధం
- ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్ డిసి : ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా సాగిస్తున్న యుద్ధోన్మాద దాడులను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సమర్థించుకున్నారు. ఈ ‘యుద్ధం’లో అమెరికాదే పైచేయి అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఉక్రెయిన్ దుందుడుకు చర్యలకు ప్రతిగా రష్యా చేపట్టిన సైనిక ఆపరేషన్‌పైనా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరదించేందుకు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో నివాసం నుంచి అమెరికా సైనికులతో నిర్వహించిన వీడియో కాల్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తన ప్రధాన లక్ష్యం యుద్ధాన్ని ఆపడం, ప్రాణనష్టాన్ని నివారించడమేనని ట్రంప్ చెప్పుకొచ్చారు. పుతిన్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చర్చలకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పుతిన్‌తో తాను ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నానని, అందుకోసం చర్చలు జరపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యుద్ధంలో ప్రతి నెలా 25 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ట్రంప్ తెలిపారు. ఈ పరిస్థితికి ముగింపు పలకడమే తన ప్రాధాన్యమని చెప్పారు. ఫ్లోరిడాలోని డోరల్‌లో జరగనున్న తదుపరి జి20 సదస్సుకు పుతిన్ హాజరవుతారా? అని విలేకరులు ప్రశ్నించగా ట్రంప్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఆయన రావాలనుకుంటే స్వాగతిస్తానని తెలిపారు. అయితే కొంతమంది దీనిని ఇష్టపడకపోవచ్చని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ప్రస్తుతం తమ దేశ ప్రాధాన్యం విదేశీ ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడమేనని స్పష్టం చేశారు. దేశానికి అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చూడటం, వాణిజ్య మార్గాలను తెరిచి ఉంచడం, పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇరాన్‌ను అన్ని వైపుల నుంచి దిగ్బంధించడం సాధ్యం కాదని శత్రుదేశాలకు తెలియజేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. చర్చలకు తాము వ్యతిరేకం కాదని, దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆంక్షలు, విదేశీ ఒత్తిళ్లను ఎదుర్కోవడమే తమకు ముఖ్యమైన బాధ్యతగా మారిందన్నారు.








కామెంట్‌లు (0)