శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హిందూ జాతీయవాదాన్ని సమర్థించను

3 గంటల క్రితం

హిందూ జాతీయవాదాన్ని సమర్థించను
- యుఎస్‌ ప్రతినిధి రో ఖన్నా వ్యాఖ్యలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​- యుఎస్‌ ప్రతినిధి రో ఖన్నా వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ : భారతదేశంలో విద్యార్థులు నిరసనలకు మద్దతు ఇస్తున్నానని, హిందూ జాతీయవాదాన్ని సమర్థించనని యుఎస్‌ ప్రతినిధి రో ఖన్నా పేర్కొన్నారు. నవంబర్‌ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాలిఫోర్నియా నుండి రో ఖన్నా అమెరికా కాంగ్రెస్‌కు మరోసారి ఎన్నికయ్యారు. ఆ మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతినిధుల సభలో భారత్‌, భారతీయ అమెరికన్లపై కాంగ్రెస్‌ కాకస్‌కు సహ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఖన్నా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛా కమిషన్‌ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) మైనారిటీ హక్కుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాను హిందూ జాతీయ వాదాన్ని నిస్సందేహంగా ఖండించానని అన్నారు. అలాగే, ‘‘అవినీతికి వ్యతిరేకంగా, అందరినీ కలుపుకుని పోయే విధానానికి మద్దతుగా గళమెత్తుతున్న విద్యార్థులను అభినందిస్తున్నాను’’ అని సోషల్‌ ‌మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. మా తాతగారు గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమని, తాను గాంధీ, నెహ్రూల బహుళత్వ దృక్పథాన్ని విశ్వసిస్తానని అన్నారు. 1977 వరకు భారతదేశ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, తన తల్లి తరఫు తాత అయిన అమర్‌నాథ్ విద్యాలంకర్‌ను ప్రస్తావిస్తూ ఖన్నా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు 2023లో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రో ఖన్నా హాజరయ్యారు. అమెరికా చట్టసభ సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తూ ఆయన భారతదేశానికి వచ్చారు. 2022లో, శిక్షాత్మకమైన (సిఎఎటిఎస్‌ఎ) ఆంక్షల నుండి భారతదేశానికి మినహాయింపులు మంజూరు చేసే అమెరికా కాంగ్రెస్ శాసన సవరణను కూడా ఆయన రచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్